మహా శివరాత్రి రోజు ఏం చేయాలి.. ఎలా చేయాలి.. జాగరణ విధానం ఏంటీ.. ఏం తినాలి.. ఏం తినకూడదు..!

మహా శివరాత్రి రోజు ఏం చేయాలి.. ఎలా చేయాలి.. జాగరణ విధానం ఏంటీ.. ఏం తినాలి.. ఏం తినకూడదు..!

శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. హిందువులు పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు. అలాగే శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి. మాఘమాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి వస్తుంది. ఈ రోజున శివుడిని భక్తి, పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఫిబ్రవరి 15న వచ్చింది. 

దేశమంతటా శివాలయాల్లో పెద్ద ఎత్తున శివరాత్రి సంబరాలు జరుగుతుంటాయి. శివరాత్రి అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది. ఉపవాసం, జాగరణ. ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

శివరాత్రి వ్రతం.. ఎలా చేయాలి?

శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి ఆ తర్వాత శివరాత్రి వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. ఇంట్లోనే గానీ, ఆలయంలోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. రాత్రంతా జాగరణం ఉండి, ఉదయాన్నే స్నానం చేశాక మళ్లీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి.

ఇలా చేయండి

  •  ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి.
  •  గుడికి వెళ్లి దేవుడ్ని దర్శనం చేసుకోవాలి. 
  •  అన్నం లాంటి రోజూ తీసుకునే ప్రధాన ఆహారం కాకుండా పాలు, పండ్లు మాత్రమే, అదీ సాయంత్రం పూటనే తీసుకోవాలి. 
  •  ఇతరులతో దైవ సంబంధమైన మాటలనే ఎక్కువగా మాట్లాడితే మంచిది.
  • ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
  •  అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండకండి.

మహా శివరాత్రి నాడు (ఫిబ్రవరి 15) న భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తారు. చాలామంది కఠినంగా ఉండి.. కనీసం నీరు కూడా తాగరు.  దీనిని నిర్జల ఉపవాసం అంటారు. కొంతమంది పాలు పండ్లు లాంటి సాత్విక ఆహారం తీసుకుంటారు. ప్రస్తుతం జీవన ప్రమాణాల దృష్ట్యా పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీరు డ్రై ఫ్రూట్స్  వంటివి కూడా తినవచ్చు. ఫిబ్రవరి 16న సూర్యోదయం అయిన తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. 

 శివరాత్రి రోజు  తినకూడని పదార్దాలు

మహాశివరాత్రి ఉపవాస సమయంలో కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తినకూడదు. వీటిలో గోధుమలు, బియ్యం, పప్పులు మరియు పప్పుధాన్యాలు వంటి ధాన్యాలు ఉన్నాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి , ఉడికిన పదార్ధాలను తినకూడదు.  ఇంకా వీటితో పాటుగా మద్యం,, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. 

జాగరణ విధానం

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుతుందని చెప్తారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.