రిలయన్స్ జియో తన వినియోగదారులకు 2026 నూతన సంవత్సర కానుకగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరుతో విడుదలైన ఈ ప్లాన్లు కేవలం డేటా, కాల్స్‌కే పరిమితం కాకుండా.. ఆధునిక సాంకేతికతను సామాన్యులకు చేరువ చేసేలా ఉన్నాయి. ఈసారి గూగుల్‌తో జతకట్టిన జియో, తన ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లతో 'జెమిని ప్రో ఏఐ' సేవలను ఉచితంగా అందిస్తూ టెలికాం రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ప్రధానంగా 'హీరో యాన్యువల్ ప్లాన్' పేరుతో వచ్చిన రూ.3వేల 599 రీఛార్జ్ వినియోగదారులను భారీగా ఆకర్షిస్తోంది. ఏడాది పొడవునా అంటే 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5G సేవలు లభిస్తాయి. అయితే దీనిలో అసలైన హైలైట్ ఏమిటంటే.. 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించడం. తమ పనుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం కోరుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం.
ఇక వినోదం, ఏఐ సేవలు రెండూ కావాలనుకునే వారి కోసం రూ.500 ధరతో 'సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్' అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటాతో పాటు భారీ ఓటీటీ బండిల్ లభిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్ వంటి 12 పైగా ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు దీనికి కూడా 18 నెలల జెమిని ప్రో ఏఐ యాక్సెస్ లభించడం విశేషం.
చిన్నపాటి అవసరాల కోసం రూ.103తో 'ఫ్లెక్సీ ప్యాక్'ను కూడా జియో పరిచయం చేసింది. ఇది 28 రోజుల పాటు 5GB అదనపు డేటాతో పాటు వినియోగదారులు తమకు నచ్చిన భాషలో ఎంటర్టైన్మెంట్ ప్యాక్‌ను ఎంచుకునే వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్లన్నీ జియో వెబ్‌సైట్, మైజియో యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. కేవలం నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా మాత్రమే కాకుండా.. ఏఐ ఆధారిత సేవలందించే డిజిటల్ భాగస్వామిగా జియో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
