ICC– Bangladesh: బీసీసీఐతో వివాదానికి ముగింపు పలికేలా ఐసీసీ చైర్మన్ ప్లాన్.. రివీల్ చేసిన బంగ్లాదేశ్ 

ICC– Bangladesh: బీసీసీఐతో వివాదానికి ముగింపు పలికేలా ఐసీసీ చైర్మన్ ప్లాన్.. రివీల్ చేసిన బంగ్లాదేశ్ 

ICC– Bangladesh:ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15న) కొలంబోలో జరగనున్న భారత్–పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కేవలం ఒక క్రికెట్ పోరే కాదు.. ఈ మ్యాచ్ ఆసియా క్రికెట్ బోర్డుల మధ్య కీలక దౌత్యానికి వేదికగా మారనుంది. ఐదు ఆసియా దేశాల క్రికెట్ బోర్డుల అగ్రనేతలు ఒకే చోట సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఐసీసీ చైర్మన్ జై షా కొలంబోకు రానున్నట్లు తెలుస్తుంది. అతడి సమక్షంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా ఆసియా క్రికెట్ బోర్డుల ముఖ్యాధికారుల మధ్య అనధికారిక సమావేశం జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.  

ఈ సమావేశంలో ప్రధానంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ పాల్గొననున్నారు. గత కొన్ని వారాలుగా బీసీసీఐ, ఐసీసీతో బంగ్లా బోర్డు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, సంబంధాలను మళ్లీ సర్దుబాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు బుల్బుల్ తెలిపారు. భారత్– పాక్ మ్యాచ్ సందర్భంగా ఈ భేటీ “ఐస్ బ్రేక్” చేసే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్‌కు రావాలన్న ఆహ్వానం నేరుగా ఐసీసీ నుంచే వచ్చిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ తెలిపారు. ఆసియా క్రికెట్‌లో కీలకమైన ఐదు దేశాల ప్రతినిధులు ఒకే చోట ఉండి, మ్యాచ్‌ను కలిసి వీక్షించి, పరస్పరం చర్చించాలన్నదే ఐసీసీ ఉద్దేశమని అన్నారు.  ఈ భేటీ ద్వారా ఇటీవల తలెత్తిన విభేదాలను తగ్గించి, ఆసియా క్రికెట్‌లో ఐక్యతను పెంచాలని ఐసీసీ భావిస్తోంది. స్టేడియంలో జరుగుతున్న తీవ్ర పోటీకి సమాంతరంగా, మైదానం బయట సహకారం, సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఐసీసీ ముందుకు సాగుతుందన్నారు.