ఇండియా, పాక్ మ్యాచ్ జరిగే స్టేడియంలోకి ఎంత పెద్ద పాము దూరిందో చూడండి..!

ఇండియా, పాక్ మ్యాచ్ జరిగే స్టేడియంలోకి ఎంత పెద్ద పాము దూరిందో చూడండి..!

కొలంబో: ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఒక భారీ పాము కలకలం రేపింది. ఎలా వచ్చిందో గానీ స్టేడియంలోకి వచ్చేసింది. ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 15న ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఈ మ్యాచ్ చూడటానికి ఇరు జట్ల అభిమానులు భారీ సంఖ్యలో ఇప్పటికే కొలంబో చేరుకున్నారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ చూడటానికో.. ఏమో.. ఈ పాము కూడా స్టేడియంలోకి ఎంటర్ అయింది. పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో ఉండగా.. పాకిస్తాన్ డగౌట్ ప్రాంతంలో పాము కనిపించింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు అలర్ట్ అయి స్టేడియం సిబ్బందికి సమాచారం అందించారు.

స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పెద్ద పామును పట్టుకోవడంతో కథ సుఖాంతం అయింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన పాక్, ఇండియా హైవోల్టేజ్ మ్యాచ్ బాయ్ కాట్ చేయాలన్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రతినిధులతో చర్చలతో పాటు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు నచ్చజెప్పడంతో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఒప్పుకుంది.

ఇండియాతో మ్యాచ్ను బహిష్కరిస్తే ఇతర దేశాల క్రికెట్ బోర్డులపై పడే ఆర్థిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీలంక, యూఏఈ వంటి మిత్ర దేశాలు పాకిస్తాన్కు నచ్చ జెప్పాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలు ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ, క్రీడా స్పూర్తిని కాపాడటానికి ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ నిర్వహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తమ బోర్డును జట్టును అదేశించింది. కేవలం రాజకీయాల కోసమే క్రీడలను పక్కన పెట్టకూడదని, క్రికెట్ స్ఫూర్తిని కాపాడటమే తమ లక్ష్యమని పాకిస్తాన్ పేర్కొంది.