హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ రాహుల్ ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశంసనీయమైన విజయాన్ని అందించిన అంకితభావం కలిగిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. పీపుల్స్ తెలంగాణ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా కాంగ్రెస్ పయనిస్తుందని స్పష్టం చేశారు.
ప్రజల నమ్మకానికి నిదర్శనం: మల్లికార్జున ఖర్గే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజల నమ్మకానికి నిదర్శనం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు నమ్మకం ఉంచారని, ఆ నమ్మకమే ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ఖర్గే పేర్కొన్నారు.
