ఢిల్లీలో హసీనా ప్రెస్ మీట్.. బంగ్లాలో షకీబుల్ హసన్ ఇంటిపై బాంబుల దాడి

ఢిల్లీలో హసీనా ప్రెస్ మీట్.. బంగ్లాలో షకీబుల్ హసన్ ఇంటిపై బాంబుల దాడి

బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత షకీబ్ ఇంటిపై దాడి జరగటం సంచలనంగా మారింది. 2026 ఆగస్టు 5వ తేదీన కొంత మంది మూక షకీబ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్ బాంబులు విసిరి పారిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 

మగురా పట్టణంలోని కేశంబోర్ ఏరియాలో వారసత్వంగా వచ్చిన  షకీబ్  ఇంటిపై రాత్రి 8.45 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంటిని ధ్వంసం చేశారు.  ఆగస్టు 5న ఢిల్లీలో ఫారెన్ కరెస్పాండెన్స్ క్లబ్ లో షేక్ హసీనా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి షకీబ్ వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అవామీ లీగ్ కాన్ఫరెన్స్ కు హాజరైనందుకు ఇంటికి నిప్పు పెట్టారు. బంగ్లాలో మరో ఫాసిజం నడుస్తోందని అవామీ లీగ్ ట్వీట్ చేసింది. 

  స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్,   పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనాతో కలిసి విలేకరుల సమావేశంలో కనిపించిన కొన్ని గంటల తర్వాత,   షకీబ్ అల్ హసన్ నివాసంలో దారుణమైన పెట్రోల్ బాంబు దాడి జరిగింది. విలేకరుల సమావేశానికి ముందు, బీఎన్‌పీ, ఇస్లామిస్ట్ జమాత్, ఎన్‌సీపీలు మొదలైన గ్రూపులు, హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రచురిస్తే న్యాయవ్యవస్థను ఆయుధంగా వాడుకుని దావా వేస్తామని  మీడియా సంస్థలను బెదిరించాయి అని అవామీ లీగ్ ఆరోపించింది.  ప్రజాస్వామ్య నిర్మాణ ప్రాజెక్ట్ పేరుతో అవామీ లీగ్ కార్యకర్తలపై కొనసాగుతున్న మారణహోమానికి  ఈ దాడి మరో నిదర్శనం. ఇది ఫాసిజం లక్షణం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. బంగ్లా ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా క్షీణించిందని.. ప్రస్తుత యునుస్ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేసిందని హసీనా పేర్కొన్నారు. నేను అక్కడికి వెళ్తే చంపేస్తారు.. అయినా వెళ్తా.. దేశ భద్రత, పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు బంగ్లా వెళ్లనున్నట్లు హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా చెప్పారు. 

2024 ఆగస్టు 5 నుంచి హసీనా బంగ్లా ను వీడి ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు.