పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేంనూర్ గ్రామంలో ఆసక్తికర ఘటన జరిగింది. నాగు పాముకు, కుక్కకు మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లోంచి వచ్చిన నాగు పామును కుక్క చూసి మొరగడంతో చుట్టుపక్కల వారి చూపు పాము, కుక్కపై పడింది. సుమారు గంట పాటు కుక్క, నాగు పాము మధ్య పోరు కొనసాగింది.
పాము పక్కనే డ్రైనేజ్ కింద రెండు కుక్క పిల్లలు పాము చెరలో ఉన్నాయి. దీంతో కుక్క తన పిల్లలను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడింది. నాగు పాము అని తెలియని కుక్క పిల్లలు పాము దగ్గరికి వెళ్ళబోయాయి. తన తల్లి తన బిడ్డల ప్రాణాలు కాపాడుకునేందుకు పామును బెదిరించింది.
ALSO READ : తిరుమల కొండపై సైకోగాడు..
చుట్టు పక్కల వారు శివుడికి మొక్కుతూ కుక్క పిల్లలకి ఏం కావద్దని కోరారు. కుక్క చాలా సేపు అరవడంతో నాగు పాము ఎట్టకేలకు వెళ్ళిపోయింది. తన పిల్లలను తల్లి కుక్క కాపాడుకుంది. అమ్మ ప్రేమ ఎందుకు వర్ణనాతీతమో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. శునకం మూగ జీవమైనా అది కూడా ఒక తల్లినే కదా. బిడ్డలు కష్టంలో ఉంటే ఏ తల్లి అయినా ఎలా చూస్తూ ఊరుకుంటుంది. అందుకే ఈ శునకం బుసలు కొట్టే కోడె నాగును కూడా ఎదిరించి నిలిచింది. తన బిడ్డలను క్షేమంగా కాపాడుకుంది.
