గల్ఫ్ తీరంలో ఇరాన్ క్షిపణులు గర్జిస్తున్నాయి.. డ్రోన్లు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి.. సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉంటే.. కోటీశ్వరుల పరిస్థితి మాత్రం మరోలా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. దుబాయ్, అబుదాబి వంటి విలాసవంతమైన నగరాల్లో నివసించే 'అల్ట్రా రిచ్' ప్రాణాలు కాపాడుకోవడానికి కోట్లు కుమ్మరిస్తున్నారు. కేవలం ఒక్క రోజులో ఈ ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడేందుకు ప్రైవేట్ జెట్ బ్రోకర్లకు 3లక్షల 50వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 3కోట్ల 20లక్షలు చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదని సమాచారం.
ఇరాన్ చేపట్టిన డ్రోన్, క్షిపణి దాడులతో దుబాయ్ ఆకాశం పొగతో నిండిపోయింది. పేలుళ్లు, ఇంటర్సెప్షన్ల ధాటికి విలాసవంతమైన 'ఫేర్‌మాంట్ ది పామ్' వంటి హోటళ్ల సమీపంలో శిథిలాలు పడి మంటలు చెలరేగడంతో సంపన్నుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పాక్షికంగా దెబ్బతినడం, విమాన రాకపోకలు నిలిచిపోవడంతో.. కమర్షియల్ ఫ్లైట్స్ కోసం వేచి చూడకుండా సొంతంగా రూట్లు వెతుక్కుంటున్నారు సంపన్నులు. ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమను యూరోప్‌కు చేర్చాలని వేడుకుంటున్నారంట.
ప్రస్తుతానికి సౌదీ అరేబియా ఒక్కటే సురక్షితమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. అందుకే దుబాయ్ నుంచి 10 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి సౌదీకి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో లండన్, పారిస్ వంటి నగరాలకు చెక్కేస్తున్నారంట ఈ అల్ట్రా రిట్. విమానాల లభ్యత తక్కువగా ఉండటం, డిమాండ్ విపరీతంగా పెరగడంతో చార్టర్ ఫ్లైట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్కో విమానానికి మూడు కోట్లకు పైగా వసూలు చేస్తున్నా.. ప్రాణ రక్షణ కోసం కార్పొరేట్ దిగ్గజాలు, సంపన్న కుటుంబాలు అడిగినంత డబ్బు క్షణాల్లో పే చేస్తున్నారు.
యుద్ధం అంటే సామాన్యుడికి చావు భయం.. కానీ ఈ ధనవంతులకు అది తమ విలాసవంతమైన జీవితాన్ని కాపాడుకునే ఖరీదైన పోరాటంలా మారిందని నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. క్షిపణుల హోరులో కూడా తమ ప్రైవేట్ సెక్యూరిటీ బలగాల రక్షణలో సరిహద్దులు దాటుతున్న ఈ అల్ట్రా రిచ్ క్లాస్ తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దుబాయ్ స్కైలైన్ మీద పొగ మేఘాలు కమ్ముకుంటుంటే.. రన్‌వేల మీద నుంచి కోటీశ్వరుల జెట్లు రయ్‌మని దూసుకుపోవటం డబ్బుకు ఉన్న పవర్ ఏంటో చూపిస్తోంది యుద్ధ భూమిలో.
