రైతులకు గుడ్ న్యూస్..40 శాతం సబ్సిడీతో డ్రోన్లు

రైతులకు గుడ్ న్యూస్..40 శాతం సబ్సిడీతో డ్రోన్లు

తెలంగాణలో వ్యవసాయ యాంత్రికరణను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి Sub-Mission on Agricultural Mechanization (SMAM) పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇప్పటికే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ ,మహిళా రైతులకు ప్రాధాన్యంతో యంత్రాలను అందజేస్తున్న ప్రభుత్వం, రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ డ్రోన్లను కూడా సబ్సిడీపై అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి  తెలిపారు.

ఈ నిర్ణయం మేరకు మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 చొప్పున వ్యవసాయ డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో, గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), ప్రాథమిక సహకార సంఘాలకు అందచేయడానికి  నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70–80 శాతం వరకు తగ్గడంతో పాటు ఎరువులు, సూక్ష్మపోషకాలు సమానంగా పంటపై పిచికారీ చేయడం సాధ్యమవుతుందని, కూలీల ఖర్చు తగ్గి రైతులకు లాభం పెరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఇటువంటి డ్రోన్లను సబ్సిడీపై సంఘాలకు అందచేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించబడిన డ్రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడం ప్రభుత్వ ధ్యేయమన్నారు.

►ALSO READ | పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం..ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూమ్

ఇదే సందర్భంగా ప్రభుత్వం ఒకవైపు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూనే, ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం పసుపు ఉడకపెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్ మరియు ఇతర ఉద్యానవన పంటల కోత పరికరాలను కూడా సబ్సిడీ పథకంలో చేర్చిందని మంత్రి తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం మరియు దరఖాస్తు విధానం వంటి వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాలలో అందుబాటులో ఉంటాయని చెప్పారు.

2025–26 సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 9936 వ్యవసాయ యంత్రాలను రూ.28.74 కోట్ల సబ్సిడీపై రైతులకు అందచేయడం జరిగిందని, రానున్న 10-15 రోజుల్లో మిగతావన్నీ రైతులకు అందచేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.