T20 World Cup: మా హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో మళ్లీ అడుతాం.. సౌతాఫ్రికా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

T20 World Cup: మా హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో మళ్లీ అడుతాం.. సౌతాఫ్రికా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కి చేరుకున్న దక్షిణాఫ్రికా.. లీగ్, సూపర్-8 దశలో వరుస విజయాలతో తొలి సెమీస్ లోకి ప్రోటీస్ అడుగు పెట్టింది. గ్రూప్–2 నుంచి సెమీస్ కి వచ్చిన న్యూజిలాండ్ తో పోటీ పడబోతుంది. మార్చి 4వ తేదీన కోల్‌కాతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తలపడనుంది. సౌతాఫ్రికా జట్టును ఇంతకు ముందు వరకు చోకర్స్ (భారీ టోర్నీల్లో విఫలమయ్యే జట్టు)గా పిలుస్తుండేవారు. కానీ తమపై ఉన్న ఆ ముద్రను గత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవడంతో చెరిపివేశామని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ శుక్రి కొన్రాడ్ తెలిపారు. 

మెగా టోర్నమెంట్లు ఆడే సమయంలో ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? అని ఆలోచిస్తామని సఫారీ ప్రధాన కోచ్ శుక్రీ పేర్కొన్నారు. సెమీఫైనల్ మ్యాచ్ కావడంతో ఇంకాస్త ఒత్తిడి పెరిగింది.. దానిని స్వీకరించి గెలుపు సాధించడంపై దృష్టి పెడతామని వెల్లడించారు. అందుకోసం గతానికి భిన్నంగా ఏమీ చేయం.. ఇప్పటి వరకు ఎలా ఆడామో.. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో అలాగే దూకుడుగా ముందుకు సాగుతామని శుక్రి కొన్రాడ్ వెల్లడించారు. 

టీ20 వరల్డ్ కప్ ని మేం టైటిల్ ఫేవరెట్ గానే స్టార్ట్ చేశాం.. ఇప్పటి వరకు అజేయంగా ఈ స్టేజ్ వరకు వచ్చామని శుక్రి కొన్రాడ్ చెప్పారు. కాబట్టి, మాపై పెద్దగా ఒత్తిడి ఉండదు.. న్యూజిలాండ్ లాంటి టాప్ జట్టుతో ఆడేటప్పుడు అలా భావించం.. తప్పకుండా గెలిచి మాకు అచ్చొచ్చిన మా హోం గ్రౌండ్ 'అహ్మదాబాద్ 'లో' జరగబోయే ఫైనల్లో ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు శుక్రీ. ఇప్పటి వరకు సఫారీ జట్టు ఎక్కువ మ్యాచ్ లని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మాత్రమే ఆడింది. టీమిండియాపై సూపర్–-8లో ప్రోటీస్ జట్టు విజయం సాధించింది. అందుకే, అహ్మదాబాద్ ని హోం గ్రౌండ్ అంటూ దక్షిణాఫ్రికా కోచ్ శుక్రి అభివర్ణించారు.