ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన జరిగింది. తమ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగినిపై సీఈవో, ఒక సీనియర్ ఉద్యోగిని, ఆమె భర్త సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తోటి మహిళ అని కూడా చూడకుండా ఉమెన్ హెడ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఆమె భర్తతో కలిసి ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడటం దారుణమైన విషయం. బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 20న శోభాగ్‌పురా ప్రాంతంలోని ఒక హోటల్‌లో కంపెనీ CEO నిర్వహించిన పుట్టినరోజు, అడ్వాన్స్ న్యూ ఇయర్ పార్టీ సమయంలో ఈ ఘటన జరిగింది. కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆహ్వానించడంతో రాత్రి 9 గంటల సమయంలో బాధిత మహిళ ఆ పార్టీలో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లింది. పార్టీ తెల్లవారుజామున 1.30 గంటల వరకు జరిగింది. పార్టీలో CEO, ఒక సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్, ఆమె భర్త ఉన్నారు.
బాధితురాలు మద్యం మత్తులో సోయిలో లేదు. ఆమెను ఇంట్లో దింపమని పార్టీకి వచ్చిన కొందరు సీఈవోకు సూచించారు. బాధిత మహిళ.. తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో కారులో కూర్చుని ఉంది. అయితే.. అప్పటికే ఆ కారులో CEO, ఉమెన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త అప్పటికే ఉన్నారు. ఆ తర్వాత సదరు ఉమెన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ కూడా కారులో ఎక్కి కూర్చుంది. ఆ ముగ్గురూ ఆమెను కారులో ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ఒక షాప్ దగ్గర ఆపి సిగరెట్స్ తీసుకుని కారులో కూర్చుని స్మోక్ చేశారు. బాధిత మహిళతో కూడా స్మోక్ బలవంతంగా స్మోక్ చేయించడంతో ఆమె పూర్తిగా స్పృహలో లేకుండా పోయింది. తర్వాత ఆమెకు కొంత సోయి వచ్చాక చూస్తే CEO తనపై అత్యాచారం చేస్తున్నట్లు గుర్తించింది. తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
►ALSO READ | దగ్గుమందును ఇలా కూడా వాడొచ్చా! బానిసలవుతున్న టీనేజర్లు.. ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు
CEO, మహిళా ఎగ్జిక్యూటివ్, ఆమె భర్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఇంటికి తీసుకెళ్లమని పదే పదే అడిగితే.. ఉదయం 5 గంటల సమయంలో తనను కారులో ఇంటి దగ్గర దిగబెట్టారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ప్రాణాలతో బయటపడిన ఆమె పూర్తిగా స్పృహలోకి వచ్చాక.. ఆమె చెవిపోగులు, సాక్స్.. లోదుస్తులు కనిపించలేదని.. ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలు కనిపించాయని తెలిపింది. తరువాత పోలీసులు కారు డాష్‌క్యామ్‌ను తనిఖీ చేశారు. ఆడియో, వీడియోను రికార్డ్ కావడంతో సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తేల్చారు. నిందితులను అరెస్ట్ చేశారు.
