క్రికెట్ గ్రౌండ్‌లో దాయాదుల పోరంటే అది కేవలం ఆట కాదు.. ఓ రణక్షేత్రం! విశ్వవిజేతను నిర్ణయించే వరల్డ్ కప్ వేదికపై ఇండియా–పాకిస్తాన్ ఢీకొంటే అది మ్యాచ్ మాత్రమే కాదు ఓ మహా సంగ్రామం! అటు 11 మంది, ఇటు 11 మంది ఆటగాళ్లు.. 22 గజాల పిచ్‌పై బ్యాట్, బాల్‌తో చేసే పౌరుషాల పోరులోప్రతీ ఓవర్ కోట్లాది మంది అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకమే.. ! వరల్డ్ కప్‌కే వన్నె తెచ్చి.. క్రికెట్ ప్రపంచానికి కిక్ ఇచ్చే మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది.
టీ20 వరల్డ్ కప్‌లో ఇండో–పాక్ మెగా క్రికెట్ వార్ నేడే! ఈ టోర్నీ చరిత్రలో దాయాదులు 8 సార్లు తలపడితే ఏడుసార్లు పాక్‌ను పడగొట్టిన ఇండియా 7–1 రికార్డుతో శత్రువు గుండెల్లో సింహస్వప్నమై గర్జిస్తోంది. అదే జోరును కొనసాగిస్తూ.. మహా శివరాత్రి పర్వదినాన లంక గడ్డపైనా అదరగొట్టి..పాకిస్తాన్‌కు ఎనిమిదోసారి ‘కాళరాత్రి’ మిగల్చాలని డిసైడ్ అయింది!
టీ20 వరల్డ్ కప్‌లో అసలైన కిక్కిచ్చే హై-ఓల్టేజ్ వార్‌కు సమయం వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా–పాకిస్తాన్ మధ్య ఆదివారం శ్రీలంక గడ్డపై మ్యాచ్ జరుగనుంది. టీ20 కప్ చరిత్రలో దాయాదులు 8 సార్లు తలపడితే ఏడుసార్లు ఇండియా పైచేయి సాధించింది. అదే జోరుతో పాకిస్తాన్‌ను ఎనిమిదోసారి పడగొట్టాలన్న టార్గెట్‌తో సూర్యకుమార్ కెప్టెన్సీలోని టీమిండియా బరిలోకి దిగుతోంది.
కొలంబో: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మైదానం వెలుపల రాజకీయాలు, బహిష్కరణ హెచ్చరికలు, ఐసీసీ బుజ్జగింపుల పర్వం ముగిసి.. ఇప్పుడు అసలైన ఆట మొదలవ్వనుంది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ గ్రూప్–ఎ పోరులో తలపడనున్నాయి. రికార్డుల పరంగా దాయాదిపై ఇండియాదే పూర్తి పైచేయి. ఈ పోరులో గెలిస్తే సూపర్–8 బెర్తు ఖాయం అవనుంది.
అభిషేక్ ఫిట్.. మిడిలార్డర్‌పైనే టెన్షన్
మెగా మ్యాచ్‌కు ముందు టీమిండియాలో అందరి ఫోకస్ అభిషేక్ శర్మ పైనే ఉంది. నమీబియాతో మ్యాచ్‌కు అనారోగ్యం వల్ల దూరమైన యంగ్ ఓపెనర్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు రెడీ అవడంతో ఇండియా బలం పెరిగింది. అయితే మిడిలార్డర్ ఫెయిల్యూర్ జట్టును ఇబ్బంది పెడుతోంది. టోర్నీకి ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బ్యాటింగ్ లైనప్, గత రెండు మ్యాచ్‌ల్లో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంది. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా వ్యక్తిగత పెర్ఫామెన్స్‌లే జట్టును ఆదుకున్నాయి. కానీ పాకిస్తాన్ వంటి నాణ్యమైన బౌలింగ్ ఎటాక్ ఉన్న జట్టుపై ఒకరిద్దరి ఆట సరిపోదు. ముఖ్యంగా 7 నుంచి 16 ఓవర్ల మధ్య ఇండియా బ్యాటర్లు సింగిల్స్, డబుల్స్ తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రౌండ్‌లో గెలిచిన జట్లన్నీ వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారానే 25 శాతం రన్స్ రాబట్టాయి. ఇండియా కూడా ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక, కొలంబో పిచ్ స్వభావం దృష్ట్యా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పై ఉన్న మంచి రికార్డు, గత ఆసియా కప్‌లో పాక్‌పై తన పెర్ఫామెన్స్ ( 4/30) ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, కుల్దీప్‌ను తీసుకుంటే ఫినిషర్ రింకూ సింగ్ లేదా అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టాల్సి రావచ్చు. బౌలింగ్‌లో పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తితో పాటు దాయాదిపై మంచి రికార్డు ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మరోసారి భారీ అంచనాలున్నాయి.
స్పిన్ పైనే పాక్ భరోసా..
పాకిస్తాన్ కొలంబోలో ముందుగానే మకాం వేయడం వారికి కలిసివచ్చే అంశం. హైబ్రిడ్ మోడల్ కారణంగా పాక్ ప్లేయర్లు ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడ్డారు. ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కావడంతో పాక్ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో (ఉస్మాన్ తారిఖ్, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్) బరిలోకి దిగే చాన్స్ ఉంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ తారిఖ్ వింతైన బౌలింగ్ యాక్షన్ ఇండియా బ్యాటర్లకు ఔట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలా మారే అవకాశం ఉంది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ బౌలింగ్‌లో ఇండియా ఇబ్బంది పడటం చూసిన పాక్, అదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. పాక్ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫహీమ్ అష్రఫ్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది కొత్త బాల్‌తో విసిరే సవాల్‌ను ఇండియా ఓపెనర్లు ఎలా ఎదుర్కొంటారన్నది కూడా కీలకం.
మ్యాచ్‌కు వాన ముప్పు..
ప్రేమదాస స్టేడియంలో పిచ్ స్లోగా, ఫ్లాట్‌గా ఉంటుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు పట్టు బిగిస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 170. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు సాధిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. బౌండరీ లైన్స్ పెద్దవి కావడంతో సిక్సర్లు బాదడం అంత సులభం కాదు. ఇక ఆదివారం రాత్రి వాన కురిసే అవకాశం 70 శాతం ఉందని వాతావరణ శాఖ అంచనా. అయినా ఫ్యాన్స్ మాత్రం పూర్తి స్థాయి మ్యాచ్ జరుగుతుందని ఆశిస్తున్నారు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: ఇషాన్ (కీపర్), అభిషేక్. తిలక్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్, దూబే, రింకూ సింగ్, అక్షర్, కుల్దీప్, చక్రవర్తి, బుమ్రా.
పాకిస్తాన్: సాహిబ్జాదా (కీపర్), సైమ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్, షాదాబ్, ఉస్మాన్ / ఫఖర్, నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిది, ఉస్మాన్ తారిక్, అబ్రార్.
