వెలుగు ఓపెన్ పేజీ.. ఫూలేకు ఇయ్యని భారతరత్న..సావర్కర్కు ఇస్తరా?

వెలుగు ఓపెన్ పేజీ.. ఫూలేకు ఇయ్యని భారతరత్న..సావర్కర్కు ఇస్తరా?

ఫిబ్రవరి 7, 2026న 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఉనికిపైన ముంబయిలో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు  ముంబయిలోని పెట్టుబడిదారులను, సినిమా యాక్టర్లను, వ్యాపారవేత్తలను పిలిచారు. ఆ సంస్థకు అనుకూలంగా ఉంటారు అనుకున్నవారినే  పిలిచారు. దానికి ముఖ్య​అతిథిగా ఆర్ఎస్ఎస్  సర్​ సంచాలక్​ మోహన్​ భాగవత్​ హాజరయ్యాడు.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన కొన్ని కీలక నిర్ణయాలను భాగవత్​ ఈమధ్యకాలంలో తన ఉపన్యాసాల్లో  ముందే  ప్రకటిస్తున్నాడు.

 2024 ఎన్నికల  తరువాత  చాలా రంగాల్లో పాలసీ నిర్ణయాలు చేసే అధికారం నరేంద్ర మోదీ నుంచి మోహన్ భాగవత్​కు మారాయి. మోహన్​ భాగవత్​ ఆర్ఎస్ఎస్  నిర్ణయాలుగా ఆయన ఉపన్యాసాల్లో  ప్రకటించే  పాలసీలను,  బీజేపీ  మంత్రిమండలి నిర్ణయాలుగా మార్చే స్థితికి  నరేంద్ర మోదీ వచ్చాడు.  ఆయనకు తన మొదట టర్మ్ 2014 నుంచి 2019 వరకు ఉన్నట్లుగా  పాలసీలను  నిర్ణయించే అధికారం ఇప్పుడు లేదు. స్థితి పూర్తిగా మారింది. 

వాస్తవానికి ఇప్పుడు మోదీ ఎన్నికల కటౌట్​ మాత్రమే.  నిర్ణయాధికారమంతా మోహన్​ భాగవత్​కు మారింది.  ఇది ఊహించని పరిణామేమీ కాదు.  దేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమ ఎత్తుగడలకు, ఆలోచనలకు భజనపరులుగా  మారారనేది  ఆర్ఎస్ఎస్​ అధినాయకత్వానికి  అర్థమైంది. మోదీ మాత్రమే అప్పుడో  ఇప్పుడో  ఫూలే,  అంబేద్కర్​ గురించి  మాట్లాడతాడు. కానీ మోహన్​ భాగవత్​ వారిపేరు కూడా పబ్లిక్​ మీటింగుల్లో ఎత్తుకోడు. 

అదే  మహారాష్ట్రలో  పుట్టిన  ఫూలే, అంబేద్కర్​లు  దేశంలో  ఒక  సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవానికి బీజాలు వేశారని  మోహన్​ భాగవత్​కు తెలుసు.  బాల గంగాధర్​ తిలక్​తో  ప్రారంభమైన ప్రతి విప్లవం సావర్కర్, హేగ్డేవార్, గోల్​వాల్కర్​ నుంచి ఇప్పుడు పూర్తిగా  మోహన్​  భాగవత్​ చేతికొచ్చింది.  అది  ఢిల్లీలో  సంపూర్ణ రాజకీయ, ఆర్థిక అధికారంతో జతకూడి వచ్చింది. అందుకే ఆయన మీటింగుకు రకరకాల కేసుల్లో ఇరుక్కున్న  సినిమావారు, పెట్టుబడిదారులు,  వ్యాపారస్తులు పరుగెత్తుకొచ్చారు. ఎన్నో కేసుల్లో ఇరుకున్న శిల్పాశెట్టి మోహన్​ భాగవత్​ మీటింగుకు హాజరుకావడమే కాదు. ఆయనకు తను పెద్ద ఫ్యాన్​ అని మీడియా ముందే పొగిడింది. 

సావర్కర్​కు ఇవ్వకపోవడం అన్యాయమా..

ఈ మీటింగులోనే సావర్కర్​కు భారతరత్న ఇవ్వడం గురించి లేవనెత్తాడు మోహన్​ భాగవత్. ఆయనకు ఇప్పటివరకు భారతరత్న ఇవ్వకపోవడం ఒక పెద్ద అన్యాయమనే ధోరణిలో మాట్లాడుతూ.. ఆయనకు భారతరత్న ఇస్తే ఆ అవార్డుకే వన్నె వస్తుందని, ఆయన ఆ అవార్డుకంటే ఎన్నో మెట్లుపై ఉన్నాడని చెప్పాడు. మహాత్మా గాంధీకి భారతరత్న ఇవ్వాలనే చర్చ వచ్చినప్పుడు, అదీ మొదటి అవార్డే ఆయనకు ఇవ్వాలనే చర్చ​అది నెహ్రూ, బాపూజీ భారతరత్న కంటే చాలా ఎత్తైనవాడు అని ఆయనకు 1954లో  ఇవ్వలేదు.  బదులుగా ఒక కన్నింగ్​ బ్రాహ్మణ చాంధసవాది నాయకుడైన చక్రవర్తి  రాజగోపాలాచారికి ఇచ్చారు.  అది కచ్చితంగా నెహ్రూ చేసిన తప్పే. 

అది, ఆనాడు ఇస్తే గాంధీకి లేదా అప్పటికి బతికి ఉన్న అంబేద్కర్​కు ఇచ్చి ఉండాల్సింది. రాజగోపాలాచారి అంబేద్కర్​ స్టేచర్​ ముందు చాలా చిన్నవాడు. అది మనకు ఇప్పడు అర్థమౌతుంది. 1954 నుంచి 2026 వరకు 50 మందికి భారతరత్న ఇస్తే అందులో 34 బ్రాహ్మణులకే ఇచ్చారు.  ఐదుగురు శూద్రులకు మాత్రమే ఇచ్చారు. ఎప్పుడో భారతరత్న దక్కాల్సిన చరణ్​సింగ్,  కర్పూరీ ఠాకూర్​లకు 2024లో మోదీ ప్రభుత్వం ఇచ్చింది. 

ఆ ఇద్దరికి ఆ రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో  పెట్టుకుని ఇచ్చారు.  1954 నుంచి ఇప్పటివరకు  భారతరత్న  పొందిన శూద్రులు ఏడుగురు మాత్రమే. సర్దార్​ వల్లబాయ్​ పటేల్, కామరాజ్​ నాడర్, ఎంజీ రామచంద్రన్,  కర్పూరి ఠాకూర్, చరణ్​సింగ్, ఒకే ఒక దళితుడు డా. బాబా సాహెబ్​ అంబేద్కర్. ఇది ఎంత అన్యాయం?

సావర్కర్​ చరిత్ర

సావర్కర్​ 1883లో పుట్టి 1966లో చనిపోయాడు.  హిందూ మహాసభను కేవలం  బ్రాహ్మణ సభ్యులతో  ప్రారంభించాడు. దాని అసలు ఫౌండర్​  మదన్​ మోహన్​ మాలవ్య. దాన్ని 1915లో స్థాపించారు. ఆనాడు శూద్రులెవరూ అందులో లేరు.  మహారాష్ర్టలోని మరాఠాలుగాని, మాలీలు (ఫూలే కులం) ఇతర ఓబీసీలుగాని అందులో లేరు. నిజానికి మహారాష్ట్రలోని శూద్రులందరికి తాము హిందువులం అని కూడా తెలియదు. 

వాళ్లు తమను తాము శూద్రులుగా  పిలుచుకున్నారు.  అందులో కూడా  దొంతరవారి కుల వ్యవస్థ బలపడి ఉన్నందున బ్రాహ్మణులుతో ఉన్న ఐక్యత వారిలో లేదు. నిజానికి బనియాలు కూడా హిందూ మహాసభలో ఆనాడు లేరు.  హిందూ  మహాసభ ప్రారంభమైన 10ఏళ్ల  తర్వాత  1925లో  ఆర్ఎస్ఎస్ ఫామ్​ అయింది. కొద్దిమంది  బ్రాహ్మణ వ్యక్తులతో ప్రారంభమైంది. అందులో కూడా శూద్రులుగాని, దళితులుగాని అసలు చేరలేదు. 

వాళ్లు చేరాలని కూడా ఆసంస్థ నాయకులు భావించలేదు. ఎందుకంటే ఇతర కులాలకు నాయకత్వం ఇవ్వడం వారికి అసలు అంగీకారం కాదు. అయితే వందల ఏండ్ల తరువాత అధికారంలోకి వచ్చినాక కూడా ఆర్​ఎస్ఎస్​ భారతరత్న శూద్ర విప్లవకారులుగా ఎదిగిన ఫూలేకు, సావిత్రిబాయికు ఇవ్వాలని అడగడం లేదు. కానీ బ్రాహ్మణ హిందూత్వ మేధావి అయిన సావర్కర్​కు ఇవ్వాలని బహిరంగ సభలో అడుగుతున్నారు. 

సావర్కర్​కు భారతరత్న ప్రతిపాదన

ముంబయి మీటింగులో  ఒకపక్క  ఆర్ఎస్ఎస్  మారుతున్నట్టు కనపబడుతూనే  మరోపక్క కులచక్రంలోనే దాని నాయకత్వాన్ని, సిద్ధాంతాన్ని నడిపించే ప్రక్రియలో భాగమే సావర్కర్​కు భారతరత్న ప్రతిపాదన అని అర్థమౌతుంది. ఎందుకు ఆర్​ఎస్ఎస్ మారినట్లు కనిపించింది అంటున్నాను అంటే ఒకనాడు వారి హిందూత్వ సంస్కృతికి భిన్నంగా విదేశీ సంస్కృతిని ఆచరిస్తున్న సినిమా యాక్టర్లందరిని పనికట్టుకుని పిలిచి సభలో కూర్చోబెట్టారు.  

ఏ సల్మాన్​ఖాన్​ వివిధ  కాంట్రావర్సీలకు హిందీ సినిమాలో  కేంద్ర బిందువు ఆ సల్మాన్​ఖాన్​ని  మోహన్​ భాగవత్​ పొగుడుతున్నాడు.  హిందీ సినిమాల్లో  డ్రెస్​కోడ్​లను,  డ్యాన్సులను, తారల అఫేర్​లను  వ్యతిరేకిస్తూ వచ్చిన ఆర్ఎస్ఎస్​ ఇప్పుడు  వారినందరిని అక్కున చేర్చుకుంటుంది.  రెండు, మూడు పెళ్లిల్లు, విడాకులతో సంబంధం లేకుండా చేసుకున్న స్త్రీ, పురుష  యాక్టర్లను  రాజ్యసభకు పంపడం,  బీజేపీలో  చేర్చుకోవడం చేస్తుంది.

 వారు చాలాకాలం పాటిస్తూ వచ్చిన స్త్రీ, పురుష సంబంధాలు పురాతనత్వాన్ని వారు వదులుకున్నారా లేక రాజకీయ అవసరాల కోసం ఈ మార్పు వచ్చినట్లు నటిస్తున్నారా చాలాకాలం వేచి చూస్తే మాత్రమే అర్థమౌతుంది. 

శూద్రులు, దళితులు ఆలోచించాలి

మ్యారేజీ నుంచి మారి డేటింగ్​లకు దేశంలోని  సినిమా ఇండస్ట్రీ  ఈ దేశ  పెళ్లి వ్యవస్తనే  మార్చేస్తున్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈ డేటింగ్​ సంస్కృతిని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు కనిపించడం లేదు.  ఇదొక పెద్ద మార్పే. ఈ మార్పుల్లో వారి సనాతన ధర్మ సిద్ధాంతం ఎలా ఎదుగుతుందో  మునుముందు చూడాలి.  శూద్రులు, దళితులు ఆలోచించాల్సింది..దేశాన్ని మంత్రిమండలి,  ప్రధానమంత్రి నేతృత్వంలో కాక  ఆర్ఎస్ఎస్​ హైడ్​ పాలసీ నిర్ణయాలతో నడిపితే కాలక్రమంలో  రాజ్యంలో  మత  నియంతృత్వం పెరుగుతుంది. 

పాలక బీజేపీ  నడపకుండా, ఆర్ఎస్ఎస్​లాంటి ప్రజలకు జవాబుదారీ లేని  సంస్థ నడిపితే రాజ్యాంగం బతకదు. ఆర్ఎస్ఎస్, బీజేపీలో  పనిచేసే శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీలు సైతం మారుతున్న  పరిస్థితిని గమనించాలి.  రాజ్యసంస్థల్లో అన్ని అపాయింటుమెంట్లు  ఆర్ఎస్ఎస్​  ద్వారానే నడుస్తున్నాయని చర్చ జరుగుతూనే ఉంది.  సెలక్షన్​ కమిటీలు, సంస్థల అధికారులు తమ హోదాలను అనుభవిస్తూ ఆర్ఎస్ఎస్ సూచనల మేరకే  సంస్థలను నడుపుతున్నారని  స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే  మోహన్​ భాగవత్​ ఢిల్లీ ప్రభుత్వానికి, ప్రాచీనకాలంలో  చంద్రగుప్తుని  రాజ్యానికి  కౌటిల్యుడు  ప్రధాన పూజారిగా ఉండి నడిపినట్టు నడుపుతున్నాడు. ఇది పెద్ద ప్రమాదం.

ఫూలే దంపతులకు భారతరత్న ప్రతిపాదన

గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఒక ఏకగ్రీవ తీర్మానంలో  మహాత్మా ఫూలే,  సావిత్రిబాయి ఫూలేలకు ఐక్యంగా మొదటి దంపత భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఇంతవరకు మోహన్​ భాగవత్​ అనుమతి  లభించలేదు.  అందుకే  మోదీ ప్రభుత్వం  వారికి భారతరత్న ఇవ్వడానికి భయపడింది.  మోహన్​ భాగవత్​ అనుమతి లేనిదే మోదీ ఇవ్వలేడు.  ఫూలే 1827లో  పుట్టాడు.  సావిత్రిబాయి 1831లో పుట్టింది. 

వీళ్లు శూద్రులు. మహాత్మా దేశ చరిత్రను విద్య ద్వారా, రచనల ద్వారా, తన ఉద్యమాల ద్వారా మార్చిన మొదటి శూద్ర మేధావి. సావిత్రిబాయి  ఈ దేశ స్త్రీ జీవితాలను సంపూర్ణంగా మార్చిన మొదటి ఉపాధ్యాయు రాలు, రచయిత్రి. వీరు కొన్ని కులాలనో, కొన్ని వర్గాలనో మార్చినవారు కారు. మొత్తం దేశ జ్ఞాన ప్రక్రియను మార్చిన మొదటి మేధావులు. వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏకగ్రీవ రిజల్యూషన్​ ద్వారా అడిగినవారికి ఇవ్వలేదు. కానీ, సావర్కర్​కు ఇవ్వాలని ఆర్​ఎస్ఎస్​ అధినేత మోహన్​ భాగవత్​ఆయన కులానికి చెందిన వ్యక్తినే ప్రతిపాదిస్తున్నాడు. ఇదేమి  కులరహిత సంఘం?

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​