- వేములవాడ, కాలేశ్వరం, ఏడుపాయల, కొమురవెల్లి ఆలయాల్లో ముమ్మర ఏర్పాట్లు
- ఏడుపాయల జాతరకు లక్షలాదిగా భక్తులు
- భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక వసతులు
వెలుగు, నెట్వర్క్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు అందంగా ముస్తాబయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వర, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, కొమురవెల్లి మల్లన్న, కీసర గుట్ట రామలింగేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్రీ బస్సు సర్వీసులు, స్టేయింగ్ రూమ్స్, చలువ పందిళ్లు, తాగునీరు, హెల్త్క్యాంపులు ఏర్పాటు చేశారు.
ఏడుపాయల జాతరకు పది లక్షల మంది..
మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రంలో మూడు రోజుల పాటు మహాజాతర జరగనుంది. సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంజీరా నదీ పాయ వద్ద స్నాన సౌకర్యాలు, షవర్‌లు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. 150 స్పెషల్ బస్సులు, తాగునీటి నల్లాలు, ట్యాంకర్లు, టెంపరరీ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. 24 గంటల వైద్య సేవలు, గజ ఈతగాళ్లు, 900 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం, రాజగోపురం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. మధ్య నదిలో భారీ శివలింగం సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
వేములవాడకు 2.5 లక్షల భక్తులు..
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం వద్ద మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. సుమారు 2.5 లక్షల మంది భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. బేబీ ఫీడింగ్ రూమ్‌లు, వీల్ చైర్లు, స్టీల్ గ్లాసులతో నీటి పంపిణీ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా వేములవాడ దేవాలయం సౌజన్యంతో భక్తులను ఉచితంగా తరలించే ఆర్టీసీ బస్సులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాస్ రాజ్, ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి
ప్రారంభించారు.
2,243 స్పెషల్ బస్సులు..
హైదరాబాద్, వెలుగు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీజీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గతేడాది కంటే అదనంగా 208 బస్సులను నడుపుతున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. అత్యధికంగా శ్రీశైలం క్షేత్రానికి 781 బస్సులు, ఆ తర్వాత వేములవాడకు 416, కీసరగుట్టకు 326, ఏడుపాయలకు 249, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 బస్సులను నడపనున్నారు. అలాగే కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు మరో 273 బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ పాయింట్ల నుంచి బస్సులు బయలుదేరుతాయి. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీల కంటే 50 శాతం(1.5 రెట్లు) ఎక్కువగా వసూలు చేయనున్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత చార్జీలే ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది.
కాళేశ్వరంలో తెప్పోత్సవం..
త్రివేణి సంగమ తీరంలో ఉన్న కాళేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ గోదావరిలో తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. దీపారాధన, మహాభిషేకం, లింగోద్భవ పూజ, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. 350 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు.
కొమురవెల్లిలో పెద్ద పట్నం..
మహాశివరాత్రి సందర్భంగా కొమురవెల్లి మల్లన్న దర్శనానికి భక్తులు బాట పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సుమారు లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రత్యేకంగా పెద్ద పట్నం కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం, అనంతరం పెద్ద పట్నం జరుగుతుంది. 250 మంది ఒగ్గు పూజారులతో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టారు.
