ఆందోళన కారులపై కేసులు కొట్టేస్తాం.. కానీ వాళ్లను మాత్రం వదలం: ఢిల్లీ ప్రభుత్వం..

ఆందోళన కారులపై కేసులు కొట్టేస్తాం..  కానీ వాళ్లను మాత్రం వదలం: ఢిల్లీ ప్రభుత్వం..

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నిరసన కారులపై కేసుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యార్థులపై కేసుల పేరుతో వేధిస్తే మరోసారి ఉద్యమిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరించిన క్రమంలో.. నిరసన కారులపై చర్యలు ఉండవని చెప్పింది ప్రభుత్వం. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయనే ఆరోపణలతో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు గురువారం (జులై 30) క్లారిటీ ఇచ్చింది. 

నిరసనల్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవద్దని  ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్‌సిటి) వ్యాప్తంగా పోలీసు అధికారులను హోం శాఖ  ఆదేశించినట్లు  ప్రకటనలో తెలిపింది. విద్యార్థులను, సీజేపీ నిరసన కారులపై చర్యలు ఉండవని చెప్పిన ప్రభుత్వం..  నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే క్రిమినల్ కేసులు ఉన్న వారికి ఈ మినహాయింపు వర్తించదని తెలిపింది.  

జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన సందర్భంగా చెలరేగిన హింసాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దీనిపై సీజేపీ నుంచి వ్యతిరేకత రావడంతో  ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బీహార్, అస్సాం, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నాయి. అదే  బాటలో ఢిల్లీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. 

జులై 20న ఏమి జరిగింది?

2026 జులై 20న, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జంతర్ మంతర్ నుంచి  చలో పార్లమెంటు  యాత్రను నిర్వహించింది. భారీ పోలీసు బందోబస్తు, పలు అంచెల బారికేడ్లతో కూడిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వేలాది మంది నిరసనకారులు  పార్లమెంట్ వైపు వెళ్లడానికి   ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షలలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

►ALSO READ | వందేమాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం..

జనపథ్, రైసినా రోడ్ సమీపంలో నిరసనకారులు బారికేడ్లను ఛేదించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, దీంతో భద్రతా సిబ్బందితో ఘర్షణలు చెలరేగాయి.

గుంపును చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్,  లాఠీ ఛార్జీలతో విరుచుకుపడ్డారు.  ఈ అల్లర్ల సమయంలో రాళ్ల దాడి కూడా జరిగింది.   ఈ హింసాకాండలో వేలాది మంది నిరసన కారులు తీవ్రంగా గాయపడ్డారు. అదే క్రమంలో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.   

నేర చరిత్ర ఉన్న వారు  2 వేల 900 మంది:

నిరసన ప్రదేశంలో నేర చరిత్ర ఉన్న వారిని పెద్ద సంఖ్యలో  గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.  జులై 20 నుంచి జులై 25 మధ్య జంతర్ మంతర్ దగ్గర నేర చరిత్ర ఉన్న 2 వేల 873 మంది పురుషులు హాజరయినట్లు పోలీసులు తెలిపారు. . ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS), ఇతర సాంకేతిక సాధనాలను ఉపయోగించి ఆ వ్యక్తులను గుర్తించినట్లు చెప్పారు. నిరసనల్లో జరిగిన హింసాకాండలో వారిలో ఎవరికైనా ప్రమేయం ఉందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తించిన వారిలో చాలా మందిపై గతంలో హత్య, లైంగిక దాడి, దోపిడీ, కిడ్నాప్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద నేరాలు, ఆయుధ సంబంధిత నేరాలు, మాదకద్రవ్యాల కేసులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వర్గాలు తెలిపాయి.

గుర్తించిన 2,873 మందిలో, 989 మందిపై తీవ్రమైన నేరాల రికార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరిలో హత్య కేసుల్లో 101 మంది, హత్యాయత్నం కేసుల్లో 62 మంది, దోపిడీ, దొంగతనాలకు సంబంధించిన 284 మంది, అత్యాచార కేసుల్లో 61 మంది, పోక్సో చట్టం కింద 6 మంది, మహిళలపై నేరాలకు సంబంధించి 25 మంది, ఆయుధాల చట్ట ఉల్లంఘనల్లో 229 మంది, లాక్కోవడం కేసుల్లో 135 మంది, కిడ్నాప్ కేసుల్లో 19 మంది, ఎన్‌డిపిఎస్, డ్రగ్స్ సంబంధించిన నేరాల్లో 67 మంది నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.