వందేమాతరం బిల్లుకు పార్లెమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో బిల్లు పాసైన మరుసటి రోజే గురువారం ( జులై 30) లోక్ సభలో ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళన మధ్యే మూజువాణి ఓటింగ్ తో బిల్లుకు ఆమోదం లభించింది.
వందేమాతరం గేయాన్ని అవమానించడం లేదా ఆలపిస్తున్నపుడు అటంకం కలిగించడం వంటి చర్యలు నేరపూరిత చర్యలుగా అభివర్ణించే.. బిల్లుకు ఉభయ సభలు ఆమోదించాయి. దీంతో ఈ బిల్లు చట్టం రూపం దాల్చనుంది.
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడిపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ్యుల నిరసనల మధ్య, లోక్‌సభలో ఈ బిల్లును మూజువాణి ఓటుతో ప్రవేశపెట్టి ఆమోదించారు.
►ALSO READ | రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి మోదీజీ: ప్రధానిపై అభిజీత్ దీప్కే విమర్శలు
జాతీయ గౌరవానికి అవమానాన్ని నిరోధించే చట్టం, 1971 పరిధిలోకి జాతీయ గీతం వందేమాతరంను కూడా చేర్చే సవరణలు బిల్లు ఇది. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అవమానించినట్లయితే, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. ఈ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత, వందేమాతరం ఆలపించే సమయంలో దానిని అవమానించడం, అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం వంటి చర్యలకు కూడా అదే తరహా శిక్ష.. అంటే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించడం జరుగుతుంది.
వందేమాతర గీతాన్ని 1875లో బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించారు. 1882లో ఆనందమఠ్ నవలలో మొదటిసారిగా ప్రచురించారు. వందేమాతరం150వ వార్షికోత్సవం పురస్కరించుకుని కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
జూలై 29న రాజ్యసభలో అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తీవ్ర వాదోపవాదాల మధ్య, గందరగోళం నడుమ ఈ బిల్లు ఆమోదం పొందింది. చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
