శ్రీశైలం శ్రావణమాసోత్సవాల సందర్భంగా భక్తులకు దేవస్థానం అధికారులు కీలక ప్రకటన చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున.. ఆర్జిత సేవలు, స్పర్శదర్శనం టికెట్లలో మార్పులు చేసినట్లు తెలిపారు.
ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 12 వరకు శ్రావణమాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే శ్రావణ శుక్ర, శని, ఆది, సోమవారాలలో.. అనగా మొత్తం 19 రోజుల పాటు ఆర్జిత అభిషేకములు, ఆర్జిత కుంకుమార్చనలను నిలుపుదల చేశారు. ఈ రద్దీ రోజులలో కేవలం ఒక్క విడతలో, అనగా రాత్రి గం. 8:30 నిమిషాల స్లాట్ నందు స్వల్పంగా కేవలం 250 స్పర్శదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు.
►ALSO READ | ITIలను ATCలుగా మార్చినందుకు నేను రాజీనామా చేయాలా..?: సీఎం రేవంత్
ఇక మిగిలిన సాధారణ రోజులలో యథావిధిగా రోజుకు మూడు నిర్దిష్ట సమయాలలో.. అనగా ఉదయం గం. 7:30 నిమిషాలకు, మధ్యాహ్నం గం. 12:30 నిమిషాలకు, రాత్రి గం. 9:00 గంటల స్లాట్లలో శ్రీస్వామి స్పర్శదర్శనం టికెట్లు లభిస్తాయి. రద్దీ తక్కువగా ఉండే ఈ రోజులలో ఆర్జిత అభిషేకం, ఆర్జిత కుంకుమార్చన టికెట్లను కూడా భక్తులు యథావిధిగా పొందవచ్చు.
భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సులభంగా టికెట్లు పొందేందుకు వీలుగా.. 80 శాతం టికెట్లను మనమిత్ర వాట్సప్ ద్వారా, మిగిలిన 20 శాతం టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా పొందే సదుపాయం కల్పించారు. కాబట్టి స్పర్శదర్శనం,ఆర్జిత సేవా టికెట్లు పొందగోరే భక్తులు ముందస్తుగానే బుక్ చేసుకుని, తదనుగుణంగా తమ యాత్రను విజయవంతం చేసుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.
