పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఏకంగా 4,16,358 క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో వస్తుండగా... ఇందులో కడెం ప్రాజెక్టు ద్వారా 1,56,279 క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ద్వారా 2,60,079 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
►ALSO READ | కుండపోత వర్షాలు..తెలంగాణలో ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 3,90,300 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో కింద విడుదల చేస్తున్నారు. అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లను ఎత్తి 3,74,275 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా... నంది పంప్ హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 275 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
