రైతులకు గుడ్ న్యూస్: ధాన్యం కొనుగోళ్లలో యాంత్రీకరణ.. హమాలీల కొరతకు చెక్

రైతులకు గుడ్ న్యూస్: ధాన్యం కొనుగోళ్లలో యాంత్రీకరణ.. హమాలీల కొరతకు చెక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రొక్యూర్‌మెంట్ పర్చేజ్ సెంటర్ల(పీపీసీ)లో యాంత్రీకరణను అమలు చేసి హమాలీల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఈ మేరకు సివిల్ సప్లైస్ భవన్‌లో బుధవారం సివిల్ సప్లైస్ కమిషనర్, ఎక్స్‌ అఫిషియో ప్రధాన కార్యదర్శి ఎం.స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. 

వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, టీజీ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అధికంగా ధాన్యం కొనుగోలు జరిగే కేంద్రాల్లో ఆటోమేటెడ్ స్టాకర్లు, ఇంటిగ్రేటెడ్ క్లీనర్-కమ్ -బ్యాగింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. 

దీంతో ధాన్యం లోడింగ్, రవాణా ప్రక్రియ వేగవంతమై కొనుగోళ్లలో జాప్యం తగ్గుతుందని అధికారులు తెలిపారు. సమావేశంలో సీఎంఆర్ నిల్వలకు అవసరమైన మౌలిక సదుపాయాలపైనా చర్చించారు. సీఎంఆర్ నిల్వల కోసం ప్రత్యేక గోదాముల స్థలాన్ని వెంటనే ఖాళీ చేసి అందుబాటులో ఉంచాలని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సివిల్ సప్లైస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.