ఎస్సీ నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్...ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై టూ, త్రీ వీలర్స్

ఎస్సీ నిరుద్యోగులకు ఎలక్ట్రిక్  వెహికల్స్...ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై టూ, త్రీ వీలర్స్
  • లక్ష లోపు ఉన్న టూ వీలర్స్ కు 90 శాతం, 4 లక్షల లోపు ధర ఉన్న త్రీ వీలర్ కు 70 శాతం సబ్సిడీ
  • 7,500  వాహనాల పంపిణీకి ఏర్పాట్లు
  • రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అప్లై
  • కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక 
  • వచ్చే నెల 15 లోపు అందించాలని సర్కారు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎస్సీ కార్పొరేషన్  ద్వారా 90, 70 శాతం సబ్సిడీతో టూ, త్రీ వీలర్  ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయబోతోంది. 2025–26 ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ లో ఈ వెహికల్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అప్లికేషన్లు స్వీకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్  ఎండీ లేఖ రాశారు. ఈ స్కీమ్ కు అర్హతలు, గైడ్ లైన్స్ ను రిలీజ్​ చేశారు.

లక్ష మంది దాకా అప్లై.. 

ఎస్సీ కార్పొరేషన్, టీజీ రెడ్కో(తెలంగాణ రినీవబుల్  ఎనర్జీ డెవలప్ మెంట్  కార్పొరేషన్  లిమిటెడ్ ) సహకారంతో అందించనున్న ఈవీ వెహికల్స్ కు అన్ని జిల్లాల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు.  5,016 టూ వీలర్  ఈవీ(ఒక్కో వెహికల్ రూ.లక్ష)లకు, 2,508 త్రీ వీలర్స్(ఒక్కో వెహికల్  రూ.3 లక్షలు గూడ్స్, ప్యాసింజర్స్  ట్రాన్స్ పోర్ట్) ఇవ్వాలని యాక్షన్ ప్లాన్ లో పొందుపర్చారు. వీటికి లక్ష మంది దాకా ఎస్సీ నిరుద్యోగులు అప్లై చేసినట్టు ఎస్సీ కార్పొరేషన్  ఉన్నతాధికారి తెలిపారు. 

రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 33 జిల్లాల్లో ఉన్న ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఏ జిల్లాకు ఎన్ని వెహికల్స్ ఇవ్వాలనే విషయాన్ని ఖరారు చేసి కలెక్టర్లకు పంపిన లేఖలో పొందుపరిచారు. ఈవీలు పంపిణీ చేసేందుకు రూ.125.40 కోట్లు ఖర్చు కానుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90 శాతం సబ్పిడీ ఇవ్వనుండగా, మిగతా 10 శాతం లబ్ధిదారుడికి బ్యాంక్  లోన్  మంజూరు చేస్తుంది. ఎస్సీల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న పీఎం అజయ్  స్కీమ్  కింద సబ్పిడీ రానుంది. రూ.లక్ష లోపు ఉన్న టూ వీలర్ కు  90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంక్  లోన్  ఇవ్వనుండగా, రూ. 4 లక్షల లోపు ఉన్న త్రీ వీలర్ కు 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంక్  లోన్  ఇవ్వనున్నారు. 

లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదే..

ఎలక్ట్రికల్ వెహికల్స్ కు వచ్చిన అప్లికేషన్లను కలెక్టర్  చైర్మన్ గా ఉన్న కమిటీ ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో కలెక్టర్ తో పాటు అడిషనల్  కలెక్టర్(లోకల్  బాడీస్), ఎస్సీ సొసైటీ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్, బ్యాంక్  మేనేజర్, ట్రాన్స్ పోర్ట్  లేదా అగ్రికల్చర్, విద్యుత్  శాఖల నుంచి ఒక అధికారి కమిటీ మెంబర్ గా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్​ లెవల్  కన్సల్టేటీవ్  కమిటీ(డీసీసీ) సమావేశాలు జరగుతున్నాయి. వీటి తరువాత డిస్ట్రిక్ట్​ లెవల్  స్ర్కీనింగ్  కమిటీ(డీఎల్సీ) లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఎస్సీ నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆదాయం, ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు, నిరుద్యోగత, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారి ప్రాతిపదికన తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 15 కల్లా లబ్ధిదారులకు ఈవీ వెహికల్స్ ను అందచేయాల్సిందేనని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను స్పీడప్​ చేశారు.

ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి..

ఈవీలతో ఎస్సీ నిరుద్యోగులకు టూ, త్రీ వీలర్ తో రోజువారీ చిరు వ్యాపారాలు, గూడ్స్, ప్రయాణికుల రవాణాతో ఉపాధి లభించనుంది. టూ వీలర్  ద్వారా కూరగాయల విక్రయంతో పాటు ఇతర చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా ఎలక్ట్రిక్  వాహనాలు లబ్ధిదారులకు నిర్వహణ భారాన్ని తగ్గించనున్నాయి. పెట్రోల్, డీజిల్  ఖర్చులు లేకపోవడంతో నిరుద్యోగులకు రోజువారీ ఆదాయంలో ఎక్కువగా మిగులుతుంది. గ్రీన్  ఎనర్జీని ప్రోత్సహించడంతో పాటు కాలుష్య నివారణకు ఈ వెహికల్స్  తోడ్పడతాయి.