కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఫోకస్ హోంమంత్రి అమిత్ షా వైపు షిఫ్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఛలో పార్లమెంటు మార్చ్ సందర్భంగా విద్యార్థులు, ఆందోళన కారులపై జరిగిన తీవ్ర దాడికి కారణం అమిత్ షానే అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం (జులై 30) తీవ్ర ఆరోపణలు చేశారు.
జులై 20న సంసద్ చలో మార్చ్‌లో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడానికి అమిత్ షా నుంచే ఆదేశాలు వచ్చాయని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తన స్వగ్రామం ఛత్రపతి సంభాజీనగర్‌లోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాదుతూ దీప్కే మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, న్యాయవ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఇక ఒక్క విపక్షం సమస్య కాదు. దేశ ప్రజలంతా కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. NEET పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో CJP నేతృత్వంలో నెల రోజులకు పైగా నిర్వహించిన నిరసన కార్యక్రమం తర్వాత స్వగ్రామం చేరుకున్న దీప్కే మాట్లాడుతూ, ఈ నిరసన ఉద్యమం వల్ల మాజీ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
►ALSO READ | ఆందోళన కారులపై కేసులు కొట్టేస్తాం.. కానీ వాళ్లను మాత్రం వదలం: ఢిల్లీ ప్రభుత్వం..
ప్రధాని మోదీ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్ని తీవ్రంగా విమర్శించిన దీప్కే, ఆయనను విచిత్రమైన వ్యక్తి అని అభివర్ణించారు. దేశ విద్యా మంత్రి అత్యాచారం చేసిన వారిని అభినందించన వారైతే సమాజానికి ఏ సందేశం వెళ్తుంది? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం గూండాలు, అత్యాచార నేరస్తులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
యోగ గురు రామ్‌దేవ్‌పై కూడా దీప్కే విమర్శలకు దిగారు. జెన్ Z విద్యార్థులు దేశ సంస్కృతిని అప్రతిష్టపాలు చేశారని రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, జెన్ జెడ్ గురించి మాట్లాడే ముందు పతంజలి బిజినెస్ చూసుకోవాలి. సుప్రీం కోర్టు పతంజలిపై చేసిన వ్యాఖ్యలను మర్చిపోరాదని హితవు పలికారు.
అమిత్ షా రాజీనామా కోరుతూ లోక్‌సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌ను దీప్కే సమర్థించారు. జులై 20న విద్యార్థులపై బలప్రయోగానికి షా నుంచే ఆదేశాలు వచ్చాయని అన్నారు.
అంతేకాకుండా, ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద రాళ్లు నిండిన ట్రక్కులు తీసుకొచ్చి, తర్వాత నిర్మాణ శిథిలాలు అని అబద్ధాలు చెప్పారని దీప్కే ఆరోపించారు. విద్యార్థులు రాళ్లు రువ్వారని, హింసకు పాల్పడ్డారని పుకార్లు పుట్టించేందుకు, ఆందోళన కారులను డైవర్ట్ చేసేందుకు చేసిన పెద్ద కుట్ర అని అన్నారు.
పోలీసులు బీజేపీ ఆదేశాలు కాకుండా రాజ్యాంగాన్ని పాటించాలని, లేకపోతే ఖాకీ చడ్డీ వేసుకొని బీజేపీ కార్యాలయం ముందు నిలబడాలని ఎద్దేవా చేశారు. రైతుల ఉద్యమాలకు CJP మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.
