ధరణి అవినీతిని బయటపెడతాం ..తప్పు చేసిన దొరలకు శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ధరణి అవినీతిని బయటపెడతాం ..తప్పు చేసిన దొరలకు శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గత పాలకులు ధనిక రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పులపాలు చేసి ఫామ్‌హౌస్‌లలో పడుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలను ఆపకుండా తల తాకట్టుపెట్టయినా సరే అమలు చేస్తున్నామని తెలిపారు. ధరణి చట్టం పేరుతో గత పాలకులు రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అర్ధరాత్రి పూట జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల లీలలను 'సెట్' (SET) ఏర్పాటు ద్వారా బయటపెడతామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు ఏది కావాలంటే అదే ఇస్తామని, ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు సుమారు 3500 దరఖాస్తులు రాగా, వాటిలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని ఆయన తెలిపారు.

►ALSO READ | చెన్నూరు ప్రజలకు కార్పొరేట్ వైద్యమే లక్ష్యం: మంత్రి వివేక్

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాటి ప్రభుత్వం, పేదలకు ఇల్లు ఇస్తే ఏమొస్తుందనే చిన్నచూపు చూసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కుల, మతాలు చూడకుండా, చివరికి గులాబీ కండువా వేసుకున్న పేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో స్వల్ప ఆలస్యం జరిగితే బస్సులు వేసుకుని మరీ రాజకీయ లబ్ధి కోసం బయలుదేరారని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయిన నిరాశలో ఏమి చేయాలో తోచక బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.