చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులనుమంత్రి వివేక్ వెంకటస్వామి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి భవనంలో అందుబాటులోకి రానున్న వైద్య సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన.. నిర్మాణ పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు సమీపంలోనే లభించేలా అత్యాధునిక వసతులతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.
►ALSO READ | ITIలను ATCలుగా మార్చినందుకు నేను రాజీనామా చేయాలా..?: సీఎం రేవంత్
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మంత్రి వివేక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమీషన్ల కోసమే కట్టడం జరిగిందని, అనవసరంగా నీళ్లను ఎత్తిపోయడంతో ప్రభుత్వానికి 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శించారు. అవే మూడు వేల కోట్ల నిధులతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి వేయి కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుండి వచ్చాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకూడదని మంత్రి సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
