సైబర్ బాధితులకు రిలీఫ్.. 2026లో రూ.139 కోట్ల రీఫండ్

సైబర్ బాధితులకు  రిలీఫ్.. 2026లో రూ.139 కోట్ల రీఫండ్

హైదరాబాద్: సైబర్ మోసాల బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ ఊరటనిచ్చారు. సైబర్ నేరాల్లో మోసపోయిన బాధితుల డబ్బును తిరిగి అందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) చేపట్టిన చర్యలు వేగంగా ఫలితాలిస్తున్నాయి. 2026లో ఇప్పటివరకు 24,189 మంది సైబర్ మోసాల బాధితులకు రూ.139.68 కోట్లను రీఫండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లోక్ అదాలత్‌తో పాటు మనీ రికవరీ మెకానిజం (MRM) ద్వారా బాధితులకు వీలైనంత త్వరగా డబ్బును పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతోంది.

TGCSB ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ మోసాల బాధితులకు రూ.514.93 కోట్ల మేర రీఫండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.బాధితులు తమ డబ్బును తిరిగి పొందేందుకు MRM ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని TGCSB సూచించింది. సైబర్ మోసం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బు రికవరీ అవకాశాలు మరింత మెరుగుపడతాయని అధికారులు సూచిస్తున్నారు.

లోక్ అదాలత్‌లో 1.51 లక్షల కేసులకు పరిష్కారం

తెలంగాణ CID ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. ఒకే ప్రక్రియలో 1,51,164 కేసులను డిస్పోజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కేసుల వారీగా చూస్తే:

FIR కేసులు: 21,843
Disaster Management కేసులు: 1,404
E-Petty కేసులు: 61,052
Motor Vehicle Act కేసులు: 62,969
Cyber Crime కేసులు: 3,896

లోక్ అదాలత్ ద్వారా ముఖ్యంగా సైబర్ మోసాల బాధితులకు కూడా ప్రయోజనం కలిగింది. 3,896 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంతో బాధితులకు రూ.42.29 కోట్ల మేర రీఫండ్ చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.

సైబర్ మోసాలపై వేగంగా స్పందించడం, బాధితుల డబ్బును నిలిపివేయడం, చట్టపరమైన ప్రక్రియ ద్వారా తిరిగి బాధితులకు అందించడం వంటి చర్యలను తెలంగాణ పోలీసులు మరింత వేగవంతం చేస్తున్నారు. సైబర్ మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేసి, MRM ద్వారా రీఫండ్ ప్రక్రియను వినియోగించుకోవాలని TGCSB సూచించింది