న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రోడ్డు, రైలు, మెట్రో ట్రైన్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.3,175.08 కోట్లతో గుడేబల్లూర్– మహబూబ్నగర్ హైవే నాలుగు లేన్లుగా 80 కి.మీ.లు విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసీ)లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.
హైదరాబాద్ – పనాజీ ఆర్థిక కారిడార్‌లోని గుడేబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న జాతీయ రహదారి-167ను రూ.3,175.08 కోట్ల ఖర్చుతో నాలుగు లేన్ల విస్తరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్, నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర, హైదరాబాద్‌కు ఈ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్–పనాజీ కారిడార్‌లో భాగంగా ఈ కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం 80.01 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీనిని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం)లో నిర్మిస్తారు.
ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాలకు గణనీయమైన ప్రయోజనం జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్వీని వైష్ణవ్ తెలిపారు. ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుందని పేర్కొన్నారు.
బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు కమ్ రైలు టన్నెల్
అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద రెండు లైన్ల ట్విన్ ట్యూబ్ టీబీఎం రోడ్డు అండర్ వాటర్ రివర్ టన్నెల్ నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఎన్ హెచ్ -15లోని గోహుపూర్-ను మాలిఘర్ వరకు నాలుగు లైన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణంలో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలో మీటర్ల రోడ్ కమ్ రైల్ టన్నెల్ ను రూ.18,662 కోట్లతో నిర్మించనున్నారు. ఈ టన్నెల్ నిర్మాణంతో 250 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ టన్నెల్ నిర్మాణంతో 6 గంటల సమయం పట్టే గమ్యస్థానాన్ని కేవలం 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర నది కింద రైల్వేలైన్, నేషనల్ హైవే కోసం టన్నెల్‌ని నిర్మించనుంది.
స్టార్టప్ ఇండియా 2.0కు రూ.10 వేల కోట్లు
స్టార్టప్ ఏకోసిస్టమ్ కు వెంచర్ క్యాపిటల్ సమీకరణ ఉద్దేశంతో రూ.10 వేల కోట్ల కార్పస్ ఫండ్ తో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇది ఆవిష్కరణ ఆధారిత అభివృద్ధి ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్
మార్కెట్ ఆధారిత పట్టణ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడానికి రూ.లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యుసిఎఫ్)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వ సహాయం 25 శాతం ఉంటుంది. మార్కెట్ నుండి కనీసం 50 శాతం సేకరిస్తారు. ఇది వచ్చే ఐదేండ్లలో పట్టణ రంగంలో మొత్తం రూ.4 లక్షల కోట్ల పెట్టుబడికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఫండ్ 2025–-26 నుంచి 2030–-31 వరకు పని చేస్తోంది. అయితే, అమలు వ్యవధిని 2033–-34 వరకు పొడిగించవచ్చు.
మ్యూజియంగా నార్త్, సౌత్ బ్లాక్ లు
నార్త్, సౌత్ బ్లాకుల నుంచి సేవా తీర్థాలు, కర్తవ్య భవనాలుగా పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ‘‘యుగే యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం’’లో నార్త్, సౌత్ బ్లాక్ లను భాగం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 95 ఏండ్ల తరువాత ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వం నార్త్, సౌత్ బ్లాక్ లను ఖాళీ చేసింది.
మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు 16 మంది ప్రధాన మంత్రుల నాయకత్వంలో ఏర్పడిన మంత్రివర్గాలు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు నార్త్, సౌత్ బ్లాక్ ల సముదాయం సాక్ష్యంగా నిలిచింది. ఆ భవనాల మెట్లుపై ఉన్న ప్రధాన మంత్రుల పాదముద్రలు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. సౌత్ బ్లాక్ లోని చాంబర్ లో కేంద్ర మంత్రివర్గ సమావేశం చివరిసారిగా జరిగింది. బానిసత్వం నుంచి స్వేచ్ఛ వరకు, తరువాత స్వతంత్ర దేశం వరకు అనేక చారిత్రక సంఘటనలను ఈ భవనాలు చూశాయి.
