- ఈ ఏడాది 6 వేల మందికి ఆర్థిక సాయం అందించాలని సర్కార్ నిర్ణయం
- రూ.50,000 నుంచి రూ.1.75 లక్షలు అందించేందుకు సన్నాహాలు
- లబ్ధిదారులను, దేశాలను రెండు ప్రధాన కేటగిరీలుగా విభజించి పథకం అమలు
- త్వరలో ప్రారంభించేందుకు కార్మిక శాఖ కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన పేద యువత విదేశీ ఉద్యోగ కలలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సీఎం విదేశీ ఉద్యోగ పథకం’ ప్రారంభించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్థిక భారం కారణంగా ప్రతిభ ఉండి కూడా విదేశాలకు వెళ్లలేకపోతున్న అర్హులైన యువతకు ఈ పథకంతో ఆర్థిక సాయం అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మొత్తం 6,000 మంది లబ్ధిదారులకు విదేశీ ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకంలో దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా 50 శాతం ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించనుంది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని లబ్ధిదారుడి సొంత వాటాగా లేదా బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా విదేశీ ప్రయాణ ఖర్చులు, భాషా శిక్షణ, వీసా ప్రాసెసింగ్ వంటి వ్యయాలను భరించేందుకు ఈ సబ్సిడీ తోడ్పడుతుంది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్)తో విదేశాల్లో డిమాండ్ ఉన్న ఉపాధి రంగాలకు అనుగుణంగా యువతకు నాణ్యమైన శిక్షణ, విదేశీ భాషా నైపుణ్యాన్ని అందించనున్నారు.
దేశాల వారీగా ఆర్థిక సహాయం...
ఈ పథకం అమలులో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం లబ్ధిదారులను, దేశాలను రెండు ప్రధాన కేటగిరీలుగా విభజించింది. మొదటి కేటగిరీ కింద జీసీసీ గల్ఫ్ దేశాలు, సింగపూర్, మలేషియా, ఫిజీ, మారిషస్, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళ్లే అభ్యర్థులకు విదేశీ ప్రయాణం, వీసా ఖర్చుల కోసం గరిష్టంగా రూ.50,000 వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది.
రెండో కేటగిరీ కింద జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లే యువతకు భాషా శిక్షణ లేదా వీసా, ప్రయాణ ఖర్చుల కోసం గరిష్టంగా రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ సహకారం అందించనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్మాణ, హెల్త్ కేర్ (నర్సింగ్, ఫిజియోథెరపీ), లాజిస్టిక్స్, ఉత్పాదక రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు భారీగా డిమాండ్ ఉన్నందున అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు ఈ సహాయం ఎంతగానో దోహదపడనుంది.
సమగ్ర విధివిధానాలు, అర్హతల ఆధారంగా ఎంపిక
పథకాన్ని అర్హులైన నిరుద్యోగ యువతకే పరిమితం చేస్తూ పక్కా నిబంధనలు తీసుకురానున్నారు. పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలని, వారు తప్పనిసరిగా రాష్ట్రంలో స్థానిక నివాసి అయి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ లేదా ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ ఉండటం తప్పనిసరి. ప్రతి కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు.
సామాజిక సమతుల్యత, సమ్మిళిత వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. నిర్దేశిత విదేశీ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు, రంగాలవారీ సాంకేతిక నైపుణ్యాలు విదేశీ భాషా ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక జరగనుంది.
మోసాలకు తావు లేకుండా నిధుల విడుదల
గతంలో విదేశీ ఉద్యోగాల పేరుతో దళారులు, ప్రైవేటు ఏజెన్సీలు నిరుద్యోగులను మోసం చేసిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త పథకంలో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కేవలం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తారు. తొలిదశలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం ఆర్డీఓ/తహసీల్దార్ల స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది.
ఆ తర్వాత జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ తుది ఆమోదం తెలుపుతుంది. ప్రధానంగా, ప్రభుత్వ సబ్సిడీ సొమ్మును అడ్వాన్స్‌గా చెల్లించకుండా, అభ్యర్థి నిజంగా విదేశాల్లో ఉద్యోగాన్ని సాధించినట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే ఆధార్ అనుసంధాన డిజిటల్ డీబీటీ విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారి నుంచి నిధుల రికవరీ చర్యలు చేపట్టే నిబంధనను కూడా ఇందులో పొందుపరిచారు.
గ్లోబల్ వర్క్‌ఫోర్స్ హబ్‌గా మారుస్తం: హరిచందన
తెలంగాణను అంతర్జాతీయ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ హబ్‌గా మార్చాలనేది ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉన్న వేలాది ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవడానికి సమగ్ర వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్, హెల్త్‌కేర్, ఎలక్ట్రీషియన్లు, ట్రక్ డ్రైవర్లు, ఫిజియోథెరపిస్టులకు నెలకు సగటున రూ.3.20 లక్షల వరకు వేతనాలు లభించే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు
