నీతికథ:మనం చేసిన పాపం మనకే చుట్టుకుంటుంది..కల్తీ సరుకు అమ్మితే మనల్ని మనం మోసం చేసుకోవడమే.!

నీతికథ:మనం చేసిన పాపం మనకే చుట్టుకుంటుంది..కల్తీ సరుకు అమ్మితే మనల్ని మనం మోసం చేసుకోవడమే.!

రంగాపురం అనే గ్రామంలో రామంజి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. ఊరూరా తిరిగి సరుకులు అమ్మి సాయంత్రానికి ఇల్లు చేరుకునేవాడు. చాలా పిసినారి, పైగా అతితెలివి గలవాడు. సొంత గ్రామంలో ఇతని దగ్గర ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేవారు కాదు.

వ్యాపార నిమిత్తం పక్క గ్రామానికి వెళ్లిన రామంజి మధ్యాహ్నం వేళ వచ్చేదారిలో సరుకు సంచి దించి చెట్టు కింద సేదతీరాడు. బాగా ఎండ కాస్తోంది అదే సమయంలో అటుగా వెళుతున్న కిష్టయ్య అనే వ్యక్తి వ్యాపారస్తుణ్ని చూసి ‘‘వ్యాపారం బాగా సాగుతోందా ?’’ అని అడిగాడు. ‘‘బాగానే సాగుతోంది’’ చాలా చురుగ్గా సమాధానం ఇచ్చాడు రామంజి. ‘‘నాణ్యమైన సరుకే అమ్ముతున్నావా?’’ అనడిగాడు కిష్టయ్య. 

ఈ మాటకు గట్టిగా నవ్వేశాడు రామంజి. ‘‘దేనికి నవ్వుతున్నారు?’’ అని ప్రశ్నించాడు కిష్టయ్య. ‘‘నాణ్యత ఎక్కడ వుందని చెప్తున్నావు తినే తిండి దగ్గర నుంచి కట్టే బట్ట వరకూ నాణ్యత లేదు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు రామంజి.  ‘‘పొరబడుతున్నావు నాణ్యత లోపానికి కారణం మనమే. ఎక్కువ లాభం గడించాలనే పేరాశతో మంచి సరుకును కూడా కల్తీ చేసి అమ్ముతున్నాం, నువ్వు కూడా ఈ పని చేసేదాంట్లో మొదట ఉన్నావని తెలిసింది’’ అన్నాడు కిష్టయ్య. మళ్లీ గట్టిగా నవ్వేశాడు రామంజి. ‘‘నా సరుకు మొత్తంగా అమ్ముడుపోతోంది వచ్చిన పని చూసుకుని వెళ్లండి’’ అని కటువుగా సమాధానం ఇచ్చాడు రామంజి. కిష్టయ్య అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. 

కొన్నాళ్లు జరిగిపోయింది రామంజికి సరుకు రావడం తగ్గిపోయింది. ఆరోగ్యం కుంటుపడింది. కుటుంబానికి సరిపడా వస్తువులు కూడా రావడం లేదు. దినుసుల కోసం పక్క ఊరిలో ఉన్న తన మిత్రుడు రామయ్య దగ్గరకు వెళ్లాడు రామంజి. వెళ్లి అడగ్గానే ‘‘మీరిచ్చిన దినుసులు అమ్ముడుపోలేదు. మీ కోసమే మిగిలినట్టున్నాయి తీసుకోండి’’ అని దినుసులు మూట చేతిలో పెట్టాడు రామయ్య, పైకం ఇవ్వబోతే ‘‘అబ్బే వద్దులెండి నేనే మీకు బాకీ పడతాను తీసుకెళ్లండి’’ అన్నాడు రామయ్య. దినుసుల మూట తీసుకుని ఊరికి బయలుదేరాడు రామంజి. 

మరుసటిరోజు రామయ్యకు రంగాపురం నుంచి కబురొచ్చింది రామంజికి తన భార్య బిడ్డలకు ఆరోగ్యం కుంటుపడిందని చాలా నీరసంతో మంచాన పడ్డారని తెలిసింది. పరుగుతో అక్కడికి వెళ్లాడు రామయ్య. కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు రామంజి ‘‘చూశావా రామంజి.. మనం అమ్మిన కల్తీ సరుకు అంతా చుట్టుకుని తిరిగి మన దగ్గరకే వచ్చింది. 

మనం చేసిన పాపం పని మనకే చుట్టుకుంది. నీ వ్యాపారం కోసం నీ రాబడి కోసం ఇంకొకరిని మోసం చేయాలని చూశావు. నీ స్వార్థం నీకే బుద్ది చెప్పింది. కల్తీ సరుకు అమ్మడమంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే.. ఒకరికి చెడు చేయాలనే ఆలోచన మనలో ఉన్నంతవరకు మనకు మంచి జరగదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నిజాయితీగా జీవించు’’ అని హితవు చెప్పి రామంజి కుటుంబాన్ని వైద్యుని దగ్గరకు తీసుకెళ్లాడు రామంజి. అప్పటినుంచి నీతిగా బతకడం నేర్చుకున్నాడు రామంజి.

- నరెద్దుల రాజారెడ్డి–