'కేజీఎఫ్' నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రధాని మోదీ ప్రశంసలు!

'కేజీఎఫ్' నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రధాని మోదీ ప్రశంసలు!

కన్నడ సినిమా లెజెండ్ అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా అత్యున్నత గౌరవం 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు (2024) వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఐదు దశాబ్దాలుగా తన వైవిధ్యమైన నటనతో సీనియర్ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మైమరిపిస్తున్న ఆయనకు ఈ గౌరవం దక్కింది. సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని కేవడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించనుంది.

కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీలతో పాటు ఇంగ్లీష్‌ భాషల్లోనూ 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్. శ్యామ్ బెనెగల్ క్లాసిక్ 'అంకుర్'తో పరాకాష్టకు చేరిన ఆయన ఆర్ట్ సినిమా ప్రయాణం, ప్రఖ్యాత డోర్‌దర్శన్ సిరీస్ 'మాల్గుడి డేస్'తో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా పరిచయమైన పేరుగా మారింది. నేటితరం ప్రేక్షకులకు 'కేజీఎఫ్' (KGF) చిత్రంలో ఆనంద్ ఇంగలగి పాత్రతో తన గాంభీర్యమైన గొంతు, నటనతో మళ్లీ పూనకాలు తెప్పించారు.

►ALSO READ | Samantha: ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ వెల్లడించిన టాలీవుడ్ క్వీన్.. ఆ డ్రీమ్ మెనూపై మనసు పారేసుకున్న సమంత!

ఈ గొప్ప గౌరవంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. "ఏ పాత్రలోనైనా జీవించే అనంత్ నాగ్ గారికి ఈ పురస్కారం లభించడం ఎంతో అర్హమైన విషయం " అని ఎక్స్ (X) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అనేక దశాబ్దాలుగా, ఆయన అలవోక నటన, అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ , ప్రతిభ భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ సినిమాపై చెరగని ముద్ర వేశాయి. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ అరుదైన లోతును, సహజత్వాన్ని తీసుకువచ్చారు. నిజంగా విశిష్టమైన కళాకారుడైన ఆయనకు దక్కిన గౌరవం ఇది అని ప్రశంసించారు..

 

2025లో పద్మభూషణ్ అందుకున్న ఆయనకు ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది.  ఏకంగా 5 సార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసున్నారు. కేవలం వెండితెరపైనే కాక, గతంలో కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా, మంత్రిగా ప్రజాసేవలోనూ తన ముద్ర వేశారు. ఐదు దశాబ్దాల సినీ తపస్సుకు దక్కిన ఈ గౌరవంపై సినీ లోకం, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.