- ఈ ఏడాది ప్రథమార్ధంలో అమ్ముడైంది 26 వేల ఇండ్లే
- భాగ్యనగరంలో ఫ్లాట్ సగటు ధర రూ.2.03 కోట్లు
- అమెరికా- ఇరాన్ యుద్ధభయం, ఏఐ ప్రభావం,
- వీసా ఆంక్షలతో కొనుగోలుదారుల వెనుకడుగు
- ధరలు తగ్గుతాయన్న వదంతులతో నిలిచిన బుకింగ్స్
- క్రెడాయ్ సీఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్నేండ్లుగా దూసుకుపోతున్న ఇండ్ల అమ్మకాలు.. ఈ ఏడాది ప్రథమార్థంలో వెనక్కిపట్టాయి. ధరలు చుక్కల్లో ఉండడం, సామాన్యుడు కొనలేని పరిస్థితులు ఏర్పడడం, ఎన్నారైలు ఆసక్తి చూపకపోవడం, అమెరికా– ఇరాన్ యుద్ధ పరిస్థితులలాంటి కారణాలతో ఇండ్లు కొనేవారు తగ్గిపోయారు. ఓవైపు అమ్మకాలు తగ్గినా.. రేట్లు తగ్గించడానికి మాత్రం రియల్టర్లు ససేమిరా అంటున్నారు. ఆకాశాన్నంటే మల్టీ బ్లాక్ అపార్ట్మెంట్లలో.. ధరలూ అదే స్థాయిలో ఉండడంతో కొనుగోలుదారులు అటువైపు కన్నెత్తిచూడడం లేదు.
క్రెడాయ్ హైదరాబాద్ - సీఆర్ఈ మ్యాట్రిక్స్ విడుదల చేసిన 2026 హాఫ్ ఇయర్లీ రిపోర్టులో ఈ విషయాలను వెల్లడించింది. 2022 తర్వాత ఇండ్ల కొనుగోళ్లు నాలుగున్నరేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. సగటు ఇంటి ధర రూ.2 కోట్ల మార్కును దాటేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో కేవలం 26,068 ఇండ్లే అమ్ముడుపోయాయి. అదే 2022 ఫస్ట్ఆఫ్లో 36 వేలకుపైగా ఇండ్లు అమ్ముడవడం విశేషం. కొనుగోళ్లు తగ్గినా కొత్త ప్రాజెక్టుల లాంచ్ ఆగకపోవడంతో హైదరాబాద్ సిటీలో ఏకంగా 1.43 లక్షల ఇండ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. ఇండ్ల సంఖ్యపరంగా కొనుగోళ్లు తగ్గినా.. విస్తీర్ణం పరంగా మాత్రం డిమాండ్ ఎక్కువే ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. సగటున 2,300 చదరపు అడుగుల లగ్జరీ ఇండ్లవైపే ఎక్కువ మంది ఆసక్తి చూపినట్టు రిపోర్టు స్పష్టంచేసింది.
అమ్మకాలకు మించి లాంచింగ్‌లు
ఓవైపు ఇండ్లు అమ్ముడవకపోయినా.. డెవలపర్లు మాత్రం కొత్త ప్రాజెక్టులను తెస్తూనే ఉన్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో 49,656 కొత్త ఇండ్లు లాంచ్ అయ్యాయి. నిరుడితో పోలిస్తే కొత్త లాంచ్‌లు 37 శాతం పెరిగాయి. అంటే.. అమ్ముడైన ఇండ్లు 26,068 అయితే, మార్కెట్లోకి వచ్చిన కొత్త సప్లై రెట్టింపు ఉండటం రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నది. ప్రస్తుతం నగరంలో ఏకంగా 1,42,722 ఇండ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. నిరుడితో పోలిస్తే అమ్ముడుపోని ఇండ్ల సంఖ్య 21 శాతం పెరిగింది. అమ్ముడుపోని వాటిలో సగానికి పైగా రూ.1.5 కోట్లకు పైబడినవేనని క్రెడాయ్ రిపోర్ట్ పేర్కొన్నది. ఈ ఇండ్లన్నీ అమ్ముడుపోవాలంటే కనీసం 29 నెలలు పడుతుందని చెబుతున్నారు. అమ్ముడుపోని ఇండ్లలో రెడీ- టు -మూవ్ కేవలం 20 శాతం (సుమారు 30 వేల యూనిట్లు) మాత్రమే ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొన్నది. మరో 59,400 ఇండ్లు 2027–28 నాటికి, మిగిలిన 53,800 ఇండ్లు 2029 తర్వాత పూర్తయ్యే ప్రాజెక్టులని వెల్లడించింది.
4 ప్రధాన జోన్లలో ఇదీ పరిస్థితి..
నార్త్ వెస్ట్ (మాదాపూర్, మియాపూర్, దుండిగల్, శంకర్‌పల్లి): మొత్తం సిటీ సేల్స్ విలువలో ఇప్పటికీ 73 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుండడం విశేషం. గతేడాది (79%)తో పోలిస్తే కాస్త తగ్గింది. ఇక్కడ ఈ ఆరు నెలల్లో 19,087 ఇండ్లు అమ్ముడయ్యాయి. కానీ డెవలపర్లు ఏకంగా 40,589 కొత్త ఇండ్లను లాంచ్ చేశారు. లాంచ్‌లు 39 శాతం పెరిగాయి. చదరపు అడుగు సగటు ధర రూ.9,820 వద్ద స్థిరంగా ఉంది. ఇక, నగరంలో అమ్ముడుపోని ఇండ్లలో అత్యధికంగా 1,13,016 ఇండ్లు ఇక్కడే
పేరుకుపోయాయి.
సౌత్ వెస్ట్ (నార్సింగి, చేవెళ్ల, మహేశ్వరం, కాటేదాన్): సిటీలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా సౌత్ వెస్ట్ నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు రూ.10,450కు చేరింది. సగటు ఫ్లాట్ ధర రూ.2.91 కోట్లు కాగా.. నిరుడు రూ.2.09 కోట్లుగా ఉంది. సిటీలో అమ్మకాల విలువలో ఈ ప్రాంతం వాటా 2022లో 10 శాతం నుంచి ఇప్పుడు 17 శాతానికి పెరిగింది. అమ్ముడుపోని 10,537 ఇండ్లలో.. 72 శాతం ఇండ్లు రూ.కోటిన్నరకు పైబడినవే. 26 శాతం ఇండ్లు రూ.3 కోట్లకు పైబడిన అత్యంత విలాసవంతమైనవి.
నార్త్ ఈస్ట్ (ఘట్‌కేసర్, తుర్కపల్లి, బీబీ నగర్): ధరల పెరుగుదలలో ఈ జోన్ సిటీలోనే టాప్‌లో ఉంది. ఇక్కడ చదరపు అడుగు రూ.8,483కు చేరింది. కొత్త లాంచ్‌లు 3,079 యూనిట్లకు చేరగా.. 1,978 ఇండ్లు అమ్ముడయ్యాయి. సగటు ఫ్లాట్ ధర రూ.1.52 కోట్లుగా ఉంది. అమ్ముడుపోని ఇండ్లలో 71 శాతం రూ.కోటిన్నర లోపువే కావడం విశేషం.
సౌత్ ఈస్ట్ (వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం): మధ్యతరగతికి అందుబాటులో ఉన్న జోన్ ఇదే కావడం విశేషం. ఇక్కడ చదరపు అడుగు రూ.7,414గా నమోదైంది. సగటు ఇంటి ధర రూ.1.23 కోట్లు. అమ్మకాలు 1,863 యూనిట్లు కాగా, కొత్త లాంచ్‌లు 2,822గా ఉన్నాయి. అమ్ముడుపోని 9,488 ఇండ్లలో 67శాతం ఇండ్లు రూ.కోటిన్నర లోపువే ఉన్నాయి.
కొనుగోళ్లు ఎందుకు తగ్గుతున్నయంటే?
హైదరాబాద్‌లో లగ్జరీ ఇండ్లను ఎన్నారైలే ఎక్కువగా కొంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వీసా రూల్స్ పెట్టడం, ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి కారణంగా ఎన్నారైలు పెట్టుబడి పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ఐటీ ఎంప్లాయ్స్.. లేఆఫ్ బుగులు
రూ.2 కోట్లకు పైబడిన ఇండ్ల కొనుగోలుకు స్థానిక ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు జంకుతున్నారు. గల్ఫ్ యుద్ధ భయాలూ కూడా కొనుగోళ్లు తగ్గేలా చేశాయి. సోషల్ మీడియాలో ధరలు పడిపోతాయంటూ జరుగుతున్న ప్రచారం కూడా కొనుగోలుదారులను వెనక్కు తగ్గేలా చేసింది.
ఐటీ ఆఫీస్ స్పేస్‌పై ఆశలు
హైదరాబాద్ కమర్షియల్ ‘ఆఫీస్ స్పేస్’ మార్కెట్ మాత్రం బలంగా ఉందని క్రెడాయ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో 68 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది. ఆఫీస్ స్పేస్ ఖాళీల శాతం 25 నుంచి 21.2 శాతానికి తగ్గింది. కంపెనీలు భారీగా వస్తుండడంతో కొత్త ఉద్యోగాలు వచ్చి రాబోయే ఐదేండ్లలో ఈ అదనపు ఇండ్లన్నీ అమ్ముడవుతాయని క్రెడాయ్ పేర్కొంది
కొండెక్కిన రేట్లు
సాధారణంగా డిమాండ్ తగ్గినప్పుడు ధరలు దిగిరావడం సహజం. కానీ నగర రియల్ ఎస్టేట్‌లో రివర్స్ ట్రెండ్ నడుస్తున్నది. అమ్మకాలు పడిపోయినా ధరలు మాత్రం తగ్గడం లేదు. గతేడాది ఫస్ట్ ఆఫ్‌లో సగటు ఫ్లాట్ ధర రూ.1.85 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మరో 10 శాతం పెరిగింది. అంటే సగటున ఒక్క ఫ్లాట్ ధర రూ.2.03 కోట్లకు చేరింది. బిల్డర్లు రేట్లు తగ్గించకపోవడం, లగ్జరీ ఫ్లాట్ల రాక పెరగడమే ఇందుకు కారణం. ఇండ్ల అమ్మకాల సంఖ్య పరంగా హైదరాబాద్ కన్నా పుణె, బెంగళూరు, ఠాణే ముందున్నాయి. దీంతో ఇండ్ల కొనుగోళ్లలో హైదరాబాద్ 3 నుంచి 4వ స్థానానికి పడిపోయింది. విస్తీర్ణంపరంగా మాత్రం హైదరాబాద్సిటీనే టాప్‌లో ఉండడం విశేషం. ఈ 6 నెలల్లో నగరంలో ఏకంగా 6 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా ఇండ్ల అమ్మకాలతో సాగిన బిజినెస్ రూ.52,913 కోట్లు కావడం విశేషం. అమ్మకాల విలువపరంగా ముంబై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.
