- లంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్, వికసిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, బీజేపీ మద్దతుదారులతో మాట్లాడారు.
ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం భారత్‌కు మంచి గౌరవం దక్కుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. తెలంగాణలో బీజేపీనే అసలైన ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు వైపుల్లాంటివని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు.
ఇప్పటికే రాష్ట్రంలో 8 మంది ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయ విద్యార్థులను సురక్షితంగా దేశానికి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందన్నారు. ఇతర దేశాల విద్యార్థులకు కూడా భారత్ సహాయం చేసిందని గుర్తు చేశారు.
భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, స్టార్టప్ రంగంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడం వల్ల తెలంగాణకు ప్రయోజనం కలిగిందని తెలిపారు.
