గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ

గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి :  కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ

మహబూబాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం(కేజీకేఎస్‌‌‌‌) రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ కోరారు. ఆదివారం మహబూబాబాద్​ జిల్లా  కేంద్రంలో బైక్​ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీత కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేల పెన్షన్, రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో గీత ప్రమాద బాధితులకు పెండింగ్‌‌‌‌లో ఉన్న రూ.20 కోట్ల ఎక్స్​గ్రేషియాను  వెంటనే విడుదల చేయాలని కోరారు. 

50 ఏళ్లు దాటిన అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో సభ్యత్వం కలిగిన 2.30 లక్షల మంది కల్లుగీత కార్మికుల్లో కేవలం 30 వేల మందికే కాటమయ్య రక్షణ కవచాలు అందాయని, అర్హులందరికీ అందించాలని కోరారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టనున్న బస్సు చైతన్య యాత్రను సక్సెస్‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర వివిధ జిల్లాల ద్వారా ఈ నెల 18న హైదరాబాద్​లోని ట్యాంక్‌‌‌‌బండ్​ వద్ద సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహం వద్ద ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్​, హైకోర్టు న్యాయవాది నలుమాస కృష్ణ, ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్​ , వివిధ గౌడ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.