బాలలు చెప్పిన బంగారు పాఠాలు..మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు

 బాలలు చెప్పిన బంగారు పాఠాలు..మహబూబ్ నగర్  జిల్లా బడిపిల్లల కథలు

‘అందని ద్రాక్ష పుల్లన’ గురించి తెలుసు. మరి ‘అందిన ద్రాక్ష తీపి’ గురించి తెలుసా?. రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతును కోయకుండా వదిలేస్తే..?  శ్రీరాముడు లంకకు వారధి కట్టేటప్పుడు మాత్రమే ‘ఉడుత సాయం’ చేయాలా?... ఇవి విచిత్రమైన ప్రశ్నల్లాగా అనిపించవచ్చు. నిజానికివి విభిన్నమైన ఆలోచనలు. ఇవి కల్మషం లేని పిల్లల మనసులో పుట్టినవి. ఇలాంటి మరెన్నో ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కథలు, పాటలు, గేయాల సమాహారాలే ‘మహబూబ్ నగర్  జిల్లా బడిపిల్లల కథలు’, ‘మల్లెమొగ్గలు–జీనుగురాల బడిపిల్లల రచనలు’ పుస్తకాలు. 

మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఆంగ్లంలో రాసిన 86 కథల సంకలనం ‘మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు’. అలాగే ఇదే జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల జిల్లా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రాసిన కథలు, గేయాలు/పాటలు, గీసిన బొమ్మల సంకలనం ‘మల్లెమొగ్గలు’ పుస్తకం. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వంలో వచ్చిన ఈ పుస్తకాల్లోని రచనలు అచ్చంగా పిల్లల సృజనాత్మకతకు ప్రతీకలు. 

ఈ పుస్తకాలు చదువుతుంటే చదువుతోపాటు సమాజాన్ని, కుటుంబాన్ని, ప్రకృతిని పిల్లలు చూస్తున్న దృష్టి కోణం అర్థమవుతుంది. అమాయకత్వం, నిజాయితీ, విలువలతో కూడిన వాళ్ల ఆలోచనలు కనిపిస్తాయి. వాళ్లలోని రచనా ప్రతిభ, సృజనాత్మకత, పరిశీలన తత్వం తెలుస్తుంది. గ్రామీణ, పట్టణ పాఠశాలల విద్యార్థులు తమ అనుభవాలు, ఊహాశక్తి, సామాజిక అవగాహనను కథలు, కవితల రూపంలో మార్చిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. వీటిలోని రచనలన్నీ ప్రధానంగా నీతి, నిజాయితీ, సమయస్ఫూర్తి, చదువు, స్నేహం, శ్రమ, కుటుంబ విలువలు, మానవత్వం, సేవాగుణం, దేశభక్తి, ఆశయాలు వంటి అంశాల చుట్టూ సాగుతాయి. విద్యార్థులు తాము ఉంటున్న ఊర్లను, తమ చుట్టూ కనిపించే మనుషుల్ని, తమ స్నేహితులను పాత్రలుగా మలిచి రచనకు ఒక రూపం తీసుకురావడం ఆకట్టుకుంటుంది. కొందరు ప్రకృతిని, జంతువులను తమ రచనకు ఆధారంగా మలచడం బాగుంది.

 పిల్లల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సృజనాత్మక ఆలోచనలను ఈ రచనలు ప్రతిఫలిస్తాయి. గేయాలు/పాటలు, బొమ్మల్లో  చిన్నారుల మనసులోని స్వచ్ఛత, భావుకత, సున్నితత్వం, ప్రేమించే గుణం కనిపిస్తుంది. భాష సహజంగా, సరళంగా పిల్లలు పాఠకులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. కథ, కథనాలను నడిపించడంలో పిల్లలు చూపిన ప్రతిభ ఆశ్చర్యపరుస్తుంది.   మొత్తంగా ‘మహబూబ్‌నగర్‌ జిల్లా బడిపిల్లల కథలు’,‘మల్లె మొగ్గలు’ పుస్తకాలు విద్యార్థుల సృజనాత్మక ప్రతిభకు అద్దం పట్టే అమూల్య రచనలు. ఈ పిల్లలు భవిష్యత్తులో రచనా రంగంలో రాణించడానికి ఉపయోగపడతాయి. మరికొందరు బాలలకు ప్రేరణగా నిలుస్తాయి. ఈ పుస్తకాలను విద్యార్థులే కాదు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక చదవాలి. 

వాస్తవానికి పుస్తకాలు, పాఠాలు, పరీక్షలు, సర్టిఫికెట్లు చదువులో ప్రతిభకు కొలమానాలయితే జ్ఞానానికి చదువుతోపాటు ఆలోచన, పరిశీలన, అనుభవం అవసరం. చదువును తరగతి గది నేర్పిస్తే, మిగిలినవి కుటుంబం, సమాజం, ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ఈ దిశగా ఉపయోగపడేలా  విద్యార్థుల తెలివితేటలను, మేధస్సును గుర్తించి, ప్రోత్సహించి, తీర్చిదిద్దేందుకు పిల్లలతో రచనలు చేయించడం ప్రశంసనీయం. పిల్లల రచనలను పుస్తకంగా  తీసుకొచ్చేందుకు సంపాదకులు, పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు చేసిన కృషి అభినందనీయం. మార్గదర్శకం.  

- జి. మహేశ్వర్​-

లైఫ్​ & లిటరేచర్​ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ  featureseditor@v6velugu.com