కాళేశ్వరం.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక..

కాళేశ్వరం.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక..
  • గ్రావిటీపై కాంగ్రెస్‌‌‌‌ మంత్రులకు అవగాహన లేదు
  • మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నేపల్లి మోటార్లతో పంపింగ్ చేయాలి : మాజీ ఎంపీ వినోద్ కుమార్

రామడుగు, వెలుగు : 'కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక, కాంగ్రెస్‌‌‌‌ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనం' అని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌‌‌‌కుమార్ విమర్శించారు. 

కాంగ్రెస్‌‌‌‌ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ చేపట్టిన కాళేశ్వరం బాటలో భాగంగా ఆదివారం వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌‌‌‌, కొప్పుల ఈశ్వర్‌‌‌‌, ఎమ్మెల్సీ ఎల్‌‌‌‌.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌‌‌‌ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌‌‌‌వాటర్‌‌‌‌ను పరిశీలించారు. 

అనంతరం మేడారం నంది పంప్‌‌‌‌హౌస్, రామడుగు గాయత్రి పంప్‌‌‌‌హౌస్ వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు. లక్ష్మీపూర్ పంపుహౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌‌‌‌హౌస్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్‌‌‌‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి 140 మీటర్లు, ఎల్లంపల్లి నుంచి మేడారం నంది పంప్‌‌‌‌హౌస్ కు 230 మీటర్లు, మేడారం నుంచి రామడుగు మండలం గాయత్రి పంప్‌‌‌‌హౌస్ కు 331 మీటర్ల ఎత్తు ఉంటుందని, గాయత్రి పంప్‌‌‌‌హౌస్ 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్‌‌‌‌చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్‌‌‌‌మానేరులోకి నీరు తరలివెళ్తుందని వివరించారు. 

ప్రస్తుతం ఎల్లంపల్లి వద్ద 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే ఉందని, మేడిగడ్డ దగ్గర 5.2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని చెప్పారు. ఎల్లంపల్లి ఎంతో కాలం ఆదుకోలేదని, మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నేపల్లి మోటార్లతో నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణలోని రిజర్వాయర్లను కాళేశ్వరం నీటితో నింపాలని కోరారు. వారి వెంట నాయకులు కొత్త జయపాల్ రెడ్డి, తుల ఉమ, వీర్ల వెంకటేశ్వరరావు, ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారు.