వెలుగు ఓపెన్ పేజీ..పోరాటమే భూపతి జీవితం

వెలుగు ఓపెన్ పేజీ..పోరాటమే భూపతి జీవితం

అది స్వాతంత్ర్యం కోసం జరిగిన సంగ్రామం కావొచ్చు... రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరు కావొచ్చు,  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం కావొచ్చు. ఉద్యమం ఏదైనా పోరాటమే జీవితంగా ముందుకెళ్లి  ఆయా ఉద్యమాల్లో  చురుకైన పాత్ర పోషించిన పోరాట యోధుడే  భూపతి కృష్ణమూర్తి.  తనకున్న ఆస్తులని విక్రయించి ఉద్యమమే జీవితంగా కొనసాగిన గొప్ప నాయకుడు ఆయన.

1926 ఫిబ్రవరి 21న హనుమకొండ జిల్లాలోని  భీమదేవరపల్లి  మండలం ముల్కనూరులో భూపతి భ్రమరాంబ -రాఘవులు దంపతులకు భూపతి కృష్ణమూర్తి జన్మించాడు.   పదహారేళ్ల  ప్రాయంలోనే  కనకలక్ష్మితో  కృష్ణమూర్తికి వివాహం జరిగింది.   

గాంధీజీతో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో..

తన రాజకీయ గురువు అయిన హయగ్రీవ చారి అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ పట్టణ కాంగ్రెస్ కు కృష్ణమూర్తి 1941 నుండి 46 వరకు కోశాధికారిగా పనిచేసి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మన్ననను పొందారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయన విశేషంగా  కృషి చేశాడు.  మహాత్మా గాంధీతో  కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో  పాల్గొన్నాడు.  గాంధేయవాది అయిన కృష్ణమూర్తి 1944లో  వార్ధాలోని  గాంధీ ఆశ్రమంలో  పది రోజులు గాంధీజీతో  గడిపారు. 1946 ఆగస్టు11న  జెండా వందనం కార్యక్రమం సందర్భంగా మొగిలయ్యను  రజాకార్లు హత్య చేసిన సంఘటనలో అక్కడ నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.  స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు. 

రజాకార్ల దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. 1953–-54 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్  వరంగల్​కు వచ్చినప్పుడు  ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి వారికి తన గళాన్ని వినిపించాడు. 1969లో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు. తనకున్న సొంత ఆస్తులు అమ్మేసి ఉద్యమానికి ఊపిరి పోశాడు. 1953 నుండి చాలా ఏళ్లపాటు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్​గా  ఉన్నాడు.  వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడితి అధ్యక్షునిగా ఛాంబర్ ఆఫ్  కామర్స్ అధ్యకునిగా ,  వరంగల్  అర్బన్ బ్యాంక్ చైర్మన్​గా,  వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం  అధ్యక్షునిగా సేవలందించారు. 

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో...

వరంగల్​లో  పలు విద్యాసంస్థల  ఏర్పాటులో  ప్రధాన భూమికను పోషించాడు. 1956లో  ములుకనూర్  సహకార సంఘ ఏర్పాటులో అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి  తదితరులతో  కలిసి  రైతులను  మమేకం చేశాడు. 1969 ఫిబ్రవరి 28న  యువకులు,  మేధావి వర్గాలతో  కలిసి హైదరాబాదులో  తెలంగాణ  ప్రజాసమితిని స్థాపించాడు.  మర్రి చెన్నారెడ్డి పార్టీని వీడిన తర్వాత తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షునిగా వ్యవహరించి అన్ని తానై ముందుకు నడిపాడు.  తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్​తో అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. 1970-–74 వరకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ సర్కిల్ సలహా మండలి సభ్యుడిగా పనిచేశాడు. 

1972లో  ప్రజాసమితి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 1977లో జనతా పార్టీ పట్టణ అధ్యక్షునిగా పనిచేసి 1978లో ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 1980లో బీజేపీలో చేరి 1983లో ఎన్నికల్లో  స్వల్ప తేడాతో  ఓటమి పాలయ్యాడు. 1983లో  టీడీపీ తరఫున  టికెట్ ఇచ్చేందుకు పార్టీ  ఎంపిక చేసినప్పటికీ కృష్ణమూర్తి  టికెట్ ను  నిరాకరించాడు. 

1986లో  షష్టి  పూర్తి చేసుకున్న సందర్భంగా  వైశ్యరత్న బిరుదుతో సత్కరించారు. ఆయన పోరాట పటిమ, సేవా దృక్పథం, ఉద్యమ నేపథ్యన్నీ చూసిన  ప్రజాసంఘాలు, అప్పటి  జేఏసీ  చైర్మన్  భూపతి కృష్ణమూర్తికి తెలంగాణ గాంధీ,  ప్రజా బంధు బిరుదును ప్రదానం చేశారు. 1990 ఫిబ్రవరి 17 తెలంగాణ ప్రజా సమితిని  పునః ప్రారంభించి అధ్యకునిగా కొనసాగాడు. 2015 ఫిబ్రవరి 15న వరంగల్​లోని ఆయన గృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

- తాళ్లపెల్లి సురేందర్