నగరం నిదరోతున్న వేళ.. సరిగ్గా రాత్రి 11 గంటలకు షటర్ ఓపెన్ అవుతుంది. దూరంగా చీకట్లో కొంతమంది బాయ్స్ వెయిట్ చేస్తుంటారు. జేబులో చేతులు పెట్టుకుని చలికి వణుకుతూ.. షాప్ ఓపెన్ చేయగానే.. వచ్చి డబ్బులు ఇస్తారు. బ్రాండ్ పేరు కూడా అడగకుండా.. లోపలికి వెళ్లిన డ్రగ్గిస్ట్.. సీక్రెట్ గా వాళ్లకు 100ml సిరప్ ఇస్తాడు. అంత సీక్రెట్ గా.. టీనేజర్స్ రాత్రుళ్లు వేచి ఉండి తీసుకుంటున్న ఆ బాటిల్స్ తో ఏం చేస్తారు..? రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై ఎందుకు ఆందోళన ఉంది. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు నడుమ ఈ వ్యవహారం ఎందుకు యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది..? దేశానికి పెను ముప్పుగా మారుతుందనే ఆందోళన ఎందుకు ఉంది..? ఇదంతా తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్ లో కాఫ్ సిరప్ వ్యవహారం ఒక సంక్షోభంలా తయారైంది. సరిగ్గా 18 ఏళ్లు కూడా నిండని యువత.. ఈ దగ్గు మందుకు బానిసవుతోంది. దీన్ని వాడటం ద్వారా కొందరు ప్రాణాలు కోల్పోయారు. మెడికల్ ఎమర్జెన్సీగా తయారైన ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సవాల్ గా మారింది. ఎందుకంటే.. ఇది ప్రస్తుతం మధ్య భారతాన్ని.. ఈశాన్ని రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం.
కాఫ్ సిరప్ ను డ్రగ్స్ మాదిరిగా వినియోగిస్తుండం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. రూ.120-180 వరకు ఉన్న దగ్గు మందును అక్రమంగా.. రూ.40-60 కే అమ్ముతున్నారు కొందరు మెడికల్ షాపు యజమానులు. రాత్రికి రాత్రే.. ఒక ఏరియాలో 20-25 బాటిల్స్ ఖాళీ అవుతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వినియోగంలో ఉందో ఆలోచించవచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప అమ్మకూడని సిరప్ ను.. విచ్చలవిడిగా అమ్ముతండటం.. నిషేధిత సిరప్ ను రాత్రుల్లో అమ్ముతుండటం ఆందోళన కలిగించే అంశం.
►ALSO READ | షాకింగ్: ఐటీ మేనేజర్‌పై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో సీఈఓ..
ఇది కేవలం పట్టణాల్లో స్లమ్స్ లో జరుగుతున్న తంతు మాత్రమే కాదు.. లక్నో నుంచి లఖింపూర్ వరకు, పాట్నా నుంచి పురూలియా వరకు, రాంచి నుంచి రాయిగంజ్ వరకు.. అంటే ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న మాఫియా. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ లో కోడైన్ ఆధారిత దగ్గు మందు అత్యధిక లాభదాయమైన డ్రగ్స్ గా మారిపోయింది.
మధ్యప్రదేశ్ లో 20 మంది మృతి:
కల్తీ దగ్గుమందుల వలన మధ్య ప్రదేశ్ లో దాదాపు 20 మంది చిన్నారులు చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ దగ్గు మందు రాకెట్ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోనూ విస్తరిస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీనేజర్లు, కూలీలు, చివరికి స్కూల్ పిల్లలు కూడా ఈ మందుకు బానిసలుగా మారుతుండటంతో కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది.
గత సంవత్సరం ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ శాఖలు, నార్కోటిక్స్, ఈడీ శాఖలు నిర్వహించిన తనిఖీల్లో.. ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడైనట్లు తేలింది. ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్యగా అధికారులు చెబుతున్నారు. లీగల్ గా తయారయ్యే కాఫ్ సిరప్ లు ఇల్లీగల్ డ్రగ్స్ వినియోగంగా మారుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు.
