షెల్ కంపెనీ పేరుతో మహిళా ఘరానా మోసం

షెల్ కంపెనీ పేరుతో మహిళా ఘరానా మోసం

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన ఓ మహిళ జాతీయ స్థాయిలో సైబర్ ఫ్రాడ్ నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ టీం నర్సంపేటకు చేరుకుని ఆమెపై ఆరా తీసింది. సదరు మహిళ కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని ఇద్దరు కొడుకులతో హన్మకొండ వడ్డేపల్లిలో నివాసం ఉన్నది. తర్వాత హైదరాబాద్‌‌లో పబ్ కల్చర్‌‌కు అలవాటు పడి ఓ పబ్‌‌ను లీజుకు తీసుకున్నట్లు సమాచారం. 

ఈ క్రమంలో పలువురు బడాబాబులతో పరిచయాలు పెంచుకుని సైబర్ మోసాలకు పాల్పడింది. ‘జమున ఎలక్ట్రానిక్స్ గూడ్స్’ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసి రూ.2 కోట్లకుపైగా తన బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నట్లు తెలిసింది. ఆ మొత్తాన్ని ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మహిళ పెద్ద కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.