శివనామస్మరణం..సకల పాపహరణం..భువి నుంచి ఉద్బవించిన శివలింగాలే జ్యోతిర్లింగాలు

శివనామస్మరణం..సకల పాపహరణం..భువి నుంచి ఉద్బవించిన శివలింగాలే జ్యోతిర్లింగాలు

పూర్వం హిమాలయాల్లోని కాంగడా ఘాట్లలో ‘జ్వాలాముఖి’ అనే ఒక దివ్యస్థానం ఉండేది. అక్కడ ధరణి గర్భం నుంచి నిరంతరం ప్రకాశించే ఒక మహాదివ్యజ్యోతి దర్శనమిచ్చేది. సాక్ష్యాత్తు శంకరుడే ఈ తేజోమయరూపంలో దర్శనమిస్తున్నాడని తెలిసి ఆ పవిత్ర జ్యోతిని చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా వెళ్లేవాళ్లు. అలాంటి జ్యోతులే భరత ఖండంలోని మరి కొన్నిచోట్ల కనిపించేవి. జ్వాలాముఖి వల్లే మిగతా జ్యోతులు ప్రకాశించేవి. వాటి స్థానాల్లోనే ద్వాదశ(పన్నెండు) జ్యోతిర్లింగ క్షేత్రాలు వెలిశాయి. అంటే భువి నుంచి ఉద్బవించిన శివలింగాలే ‘జ్యోతిర్లింగాలు’గా ప్రసిద్ధిగాంచాయి.  

సౌరాష్ట్రలోని సోమనాథుడు

గుజరాత్​లో సౌరాష్ట్రలోని వేరావల్ సముద్రతీరంలో ఈ సోమనాథుడి ఆలయం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఆది జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఇది శివతీర్థం, అగ్నితీర్థం, సూర్యతీర్థంగా చంద్రుడికి ప్రసన్నమైంది. అప్పుడు చంద్రుడు భారతదేశంలో సర్వప్రథమంగా శ్రీ శంకరుని దివ్యజ్యోతిర్లింగస్థాపనం చేసి, దానిపై సుందరమైన స్వర్ణమందిరాన్ని నిర్మించాడని స్కందపురాణం చెప్తోంది. ఈ ప్రాంతం లక్షలాదిమంది భక్తజనులతో నిత్యం కిక్కిరిసిపోతూ ఉంటోంది. 

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు

మధ్యప్రదేశ్​లోని క్షిప్రా నదీ తీరంలోని ఉజ్జయిని నగరంలో మూడో జ్యోతిర్లింగంగా మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు. పూర్వకాలంలో ఓ బ్రాహ్మణుడి కుటుంబానికి దూషణరాక్షసుడి పెట్టే కష్టాల నుంచి విముక్తి కలిగించేందుకు శివుడు అగాధం నుంచి మహాకాళ రూపంలో ఉద్భవించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో ప్రాతఃకాలంలో నాలుగు గంటల పూజ అనంతరం అభిషేకం చేసి మహాకాళుడికి చితాభస్మాన్ని పూయడం విశేషం.  

అమలేశ్వరంలో ఓంకారేశుడు

మధ్యప్రదేశ్‌‌లో నర్మదానదీ తీరాన ఉన్న విశాల ద్వీపంలో ‘ఓంకార అమలేశ్వరుడి’గా నాలుగో జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిశాడు. అక్కడి ద్వీపం, జలధార ఆకృతి ‘ఓం’ ఆకారాన్ని పోలి ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఇక్కడి గాలిలో ‘ఓం నమఃశివాయ’ అనే నాదం నిత్యం వినిపిస్తుంటుంది. కావేరి, నర్మదా నదుల సంగమప్రాంతంలో నివసించే ఈ శివుడిని పూజిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి.

పర్లిలో వైద్యనాథుడు

మహారాష్ట్రలోని పర్లి గ్రామంలో  వైద్యనాథుడిగా ఐదో జ్యోతిర్లింగ స్వరూపుడిగా వెలిశాడు. బ్రహ్మ, వేణు, సరస్వతీ నదులకు దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం జ్యోతిర్లింగ క్షేత్రంతో మరింత పవిత్రతను సంతరించుకుంది. ఇక్కడ శంకరుడు పార్వతితో కలిసి దర్శనమిస్తాడు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘అపూర్వకాశి’ అని పిలుస్తారు. ఈ పరిసరాల్లో వైద్యానికి ఉపయోగపడే ఎన్నో మూలికలు లభిస్తాయి. అంతేకాదు.. విష్ణుభగవానుడు దేవతలకు ఇక్కడే అమృతాన్ని ప్రసాదించాడని భక్తుల నమ్మకం.

డాకినిలో భీమశంకరుడు

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో భీమానది జన్మస్థానంలో భీమశంకరుడిగా, ఆరో జ్యోతిర్లింగంగా దర్శనమిస్తాడు పరమేశ్వరుడు. ఇక్కడి ఆలయాన్ని హేమాడ్–పంథీ పద్ధతుల్లో నిర్మించారు. మందిరాన్ని దశావతార ప్రతిమలతో అలంకరించారు. 

సేతుబంధంలో రామేశ్వరుడు

తమిళనాడులోని రామేశ్వర సముద్రతీరంలో రామేశ్వరుడిగా వెలిశాడు. రాముడు సీత జాడను  వెతుకుతూ సుగ్రీవుడితో మైత్రి చేస్తాడు. లంకకు వెళ్లేందుకు వానర సేనతో సేతుబంధాన్ని నిర్మించతలపెడతాడు. ఆ సమయంలో రాముడు శివపూజ చేయాలి అనుకుంటాడు. వెంటనే స్వయంగా ఇక్కడ లింగాన్ని తయారు చేసి, ఆరాధించినట్లు ప్రసిద్ది. 

ద్వారకావనంలో నాగేశ్వరుడు

మహారాష్ట్రలోని ద్వారక ప్రాంతంలో శ్రీనాగనాథుడిగా జ్యోతిర్లింగస్వరూపుడై వెలిశాడు. ఇక్కడ శివపార్వతులు శ్రీ నాగేశ్వర, నాగేశ్వరిలుగా నివాసం ఏర్పర్చుకొని ఉంటారని భక్తుల నమ్మకం. ఇక్కడ 108 శివాలయాలు, 68 తీర్థస్థానాలు ఉన్నాయి. ఈ ఆలయంలో మహాదేవుడి ఎదుట నంది విగ్రహం లేకపోవడం విశేషం. ఆలయానికి నలువైపులా 12 చిన్న చిన్న జ్యోతిర్లింగాలయాలు ఉండటం మరో విశేషం.

నాసిక్​లో త్ర్యంబకేశ్వరుడు

శివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పదోది త్య్రంబకేశ్వర ఆలయం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో గోదావరి జన్మస్థానంలో వెలిసింది. ఈ ఆలయంలోని శివలింగంపై జలహరి(అర్గ్య/లింగం) ఉండదు. ఆ స్థానంలో రోలువంటి గొయ్యి ఉంటుంది. ఈ గోతిలో బొటనవేలి ఆకారంలో మూడు లింగాలు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ మూడు లింగాల్లో నిక్షిప్తమై ఉన్నారని ప్రతీతి. అందుకే త్ర్యంబకేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ మూడింటిలో శివ లింగంపై నుంచి ఎప్పుడూ నీరు కారుతూ ఉంటుంది. 

ఎల్లోరాలో ఘృష్ణేశ్వరుడు

జ్యోతిర్లింగాల్లో పన్నెండవది ఘృష్ణేశ్వర ఆలయం. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సమీపంలో వేలూర్ గ్రామంలో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణిలో కామ్యవనంలో శివపార్వతులు నివాసం ఏర్పర్చుకొని ఉన్నారు. ఒక రోజు పార్వతి కుంకుమ కేసరిలో శివాలయ నీటిని కలిపింది. దాంతో చమత్కారంగా శివలింగం తయారై దివ్యజ్యోతి ఆర్భవించింది. ఆ దివ్యజ్యోతిర్లింగాన్ని పార్వతి ఒక రాతి లింగంలో ఉంచి లింగమూర్తిని ప్రతిష్ఠించింది. ఈ జ్యోతిర్లింగాన్ని కుంకుమేశ్వరుడు అని కూడా పిలుస్తారు. సోమనాథ్‌‌ యాత్రతో ప్రారంభమై ఘృష్ణేశ్వరుడిని దర్శించుకుంటేనే జ్యోతిర్లింగయాత్ర సంపూర్ణమవుతుంది. 

మహాశివరాత్రి విశిష్టత

మహాశివరాత్రి శంకరుడి పూజకు ఎంతో ఉద్దిష్టమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి జాగారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. సంవత్సరంలో ఐదు రకాల శివరాత్రులు ఉంటాయి. నిత్యశివరాత్రి-, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి,  యోగ శివరాత్రి.. వీటిలో మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ మహాశివరాత్రికి సంబంధించి రెండు కథలు వాడుకలో ఉన్నాయి. 

పూర్వం అంకిలుడు అనే బోయవాడుండేవాడు. ఒక రోజు వేటకు వెళ్లిన అంకిలుడికి జంతువు, పక్షి ఏదీ చిక్కలేదు. రోజంతా తిరిగి అలిసిపోయిన అతడు చీకటి పడటంతో ఓ చెట్టుపైకెక్కి విశ్రాంతి తీసుకున్నాడు. కింద పడతాననే భయంతో నిద్రపోలేదు. ఏమి చేయాలో తోచక ఒక్కో ఆకును తుంచుతూ కిందపడేశాడు. అవి ఆ చెట్టు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. తెల్లవారి ఇంటికి వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత అతను చనిపోయాడు. అతన్ని తీసుకెళ్లేందుకు యమకింకరులు, శివభటులు వచ్చారు. వాళ్లు బోయవాడిని తీసుకెళ్లేందుకు ఒకరికొకరు వాదోపవాదాలు పెట్టుకున్నారు. కానీ, శివభటులు.. ‘నాలుగు రోజుల క్రితం మహాశివరాత్రి నాడు ఈ బోయవాడు ఏమి తినకుండా బిల్వవృక్షం ఆకులతో శివలింగాన్ని అర్చించాడు. దానికి తోడు రాత్రంతా జాగారం చేశాడు. శివార్చనతో అతడు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయాయి. కాబట్టి, ఇతడు శివసన్నిధికి చేరాలి” అని అతన్ని తీసుకెళ్తారు. అప్పటినుంచి మహాశివరాత్రినాటి సహస్రబిల్వార్చన, ఉపవాసం, జాగరణ ప్రాచుర్యం సంతరించుకున్నాయి. 

మరో కథనం ప్రకారం..

పూర్వ కాలంలో ఓ రోజు ప్రళయం సంభవించింది. ప్రపంచమంతా చీకటైపోయింది. అప్పుడు లోక రక్షణ కోసం పార్వతీదేవి శివ తపస్సు చేసింది. ఆ కాళరాత్రిని పారద్రోలి రాత్రింబవళ్లను యథాస్థానంలోకి తీసుకొచ్చి జీవరాశిని కాపాడాలని శివుడిని కోరింది. శివుడు ఆమె కోరికను తీర్చాడు. అప్పుడే శివుడిని తాను చేసినట్టే ఎవరైనా శివపూజ చేస్తే వాళ్లకు సమస్త సౌఖ్యాలు చేకూరాలని కోరింది. ప్రళయకాలంలో పార్వతి చేసిన పూజ, ప్రళయానంతరం శివరాత్రినాటి శివపూజగా పరిణామం చెందింది. 

వారణాసిలో విశ్వేశ్వరుడు

ఉత్తరప్రదేశ్‌‌లోని వారణాసి దగ్గర త్రివేణి సంగమం నడిబొడ్డున శ్రీ విశ్వేశ్వరుడిగా వెలిశాడు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల సృష్టితో కాశీ ప్రాంతంలో పలు నగరాలు ఉద్భవించాయి. అక్కడే శివుడు తన ముక్తిదాయక జ్యోతిర్లింగాన్ని స్వయంగా స్థాపించాడు. అంతేకాదు.. శంకరుడు ఈ నగరాన్ని తన స్థిరనివాసంగా ఏర్పర్చుకున్నాడు. ఈ ఆలయ శిఖరం వంద అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రకృతి వినాశన సమయంలో కూడా ఈ నగరానికి ఎలాంటి ఆపద రాకుండా దండపాణి, కాలబైరవుడు సంరక్షకులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో 84 పెద్ద ఘాట్లు ఉన్నాయి. 

హిమాలయంలో కేదారేశ్వరుడు

ఉత్తరాఖండ్​లోని హిమాలయ పర్వతశ్రేణిలో కేదారేశ్వరుడిగా వెలిశాడు. ఈ తీర్థ దర్శనం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. వైశాఖ మాసం నుంచి ఆశ్వయుజం వరకు ఈ జ్యోతిర్లింగయాత్ర చేయొచ్చు. కార్తీక మాసంలో మంచు కురిసినప్పుడు నేతితో నందాదీపాన్ని వెలిగించి అన్ని ద్వారాలు మూసివేస్తారు. ఆరు నెలల తర్వాత ద్వారాలు తెరిచినప్పుడు ఆ నందాద్వీపపు దివ్యజ్యోతి దేవదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిని దర్శనం చేసుకున్నవారందరూ పునీతులవుతారు. 

శ్రీశైలంలో మల్లికార్జునుడు

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదిగా విశిష్టత సంతరించుకున్నది ఆంధ్రప్రదేశ్​ని శ్రీశైల కొండలపై వెలిసిన మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. పూర్వకాలంలో శంకరుడు ఇక్కడికి వస్తుండేవాడని, ఇదే చోట ఆయన దివ్యజ్యోతిర్లింగ రూపంలో నివసించాడని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతాన్ని కైలాస నివాసమని కూడా అంటారు. ఈ క్షేత్రానికి చేరువగా కృష్ణానది పాతాళగంగగా దర్శనమిస్తుంది. చత్రపతి శివాజీ మహాశివరాత్రి రోజున ఈ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఆలయానికి కుడివైపు గోపురం నిర్మించాడు. విజయనగర రాజులు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారని ప్రతీతి. శైలపర్వతపు ప్రాంతంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు, పాండవులు, నారదుడు, హిరణ్యకశివుడు దర్శించుకున్నారని ప్రసిద్ది. 

కోరితే వెనుకా.. ముందు ఆలోచించకుండా ఎటువంటి వరమైనా ఇచ్చే భోళా శంకరుడిగా, కోపమొస్తే దేనినైనా త్రినేత్రంతో భస్మం చేసే ప్రళయ రుద్రునిగా, కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠునిగా, ఈశ్వరునిగా, సర్వేశ్వరు నిగా, మహాదేవునిగా, హరునిగా ఇలా ఎన్నో రూపాల్లో, ఎన్నో నామాలతో భక్తుల మదిలో నిలిచి వారి కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే దైవం పరమశివుడు. అటువంటి పరమే శ్వరుడికి కోట్లాదిమంది భక్తులు మహా శివరాత్రి రోజు దేదీప్యమానమైన పూజలు చేస్తుంటారు. అటువంటి మహాశివరాత్రి, జోతిర్లింగాల విశిష్టతపై ప్రత్యేక కథనం..


- దాసరి పృధ్వీ
బెల్లంపల్లి రూరల్, వెలుగు