- స్పష్టమైన మెజార్టీ వచ్చిన చోట పోటీ పడుతున్న కౌన్సిలర్లు
- హంగ్ బల్దియాల్లో కీలకం కానున్న బీజేపీ, స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో సభ్యులు
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు దక్కించుకుంటారనే విషయం తేలడం లేదు. ఉమ్మడి జిల్లాలో 6 చోట్ల కాంగ్రెస్, 6 చోట్ల బీఆర్ఎస్ పూర్తి మెజార్టీ సాధించాయి. మిగిలిన ఏడు మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
మెజార్టీ ఉన్న స్థానాల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. మిగిలిన ఏడు బల్దియాల్లో హంగ్ ఏర్పడగా కొన్నిచోట్ల బీజేపీ, మరికొన్ని చోట్ల స్వతంత్రులు కీలకంగా మారారు. దీంతో రెండు ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో సీక్రెట్ గా బేరసారాలు చేస్తున్నారు.
రెండు చోట్ల బీజేపీ కీలకం..
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. మెదక్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కీలకంగా మారిన బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ల సపోర్ట్ కోసం రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మెదక్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్ ను మెదక్ లో నమోదు చేసుకున్నారు.
బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ సపోర్ట్ లభించినా, ఎమ్మెల్యే ఓటుతో చైర్పర్సన్ పదవి దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు 15 మంది కౌన్సిలర్ల బలం ఉన్న బీఆర్ఎస్ కు ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ల మద్దతు లభిస్తే ఈజీగా చైర్పర్సన్ పదవి కైవసం చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నాయకులు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇక నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, కాంగ్రెస్ కు 6, బీఆర్ఎస్ కు 5, బీజేపీకి నలుగురు కౌన్సిలర్ల బలం ఉంది. చైర్పర్సన్ పదవికి అవసరమైన మద్దతు కోసం మూడు పార్టీలు మరో పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే విషయంపై స్పష్టత రాలేదు. దీంతో ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుంది? ఎవరు చైర్పర్సన్, ఎవరు వైస్ చైర్పర్సన్ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రామాయంపేట, తూప్రాన్ లో..
రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8 స్థానాలు గెలుపొంది స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఒకటవ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన గజవాడ లావణ్యకు చైర్పర్సన్ పదవి దక్కనుంది. తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 9 కౌన్సిలర్ స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, కౌన్సిలర్లుగా గెలిచిన ముగ్గురు మహిళా అభ్యర్థులు రేసులో ఉన్నారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు పలువురు పోటీ పడుతున్నారు. గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీలు బీసీ మహిళ, హుస్నాబాద్ ఎస్సీ జనరల్, చేర్యాల ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో ఆయా వర్గాల నుంచి గెలుపొందిన వారు పదవులు ఆశిస్తున్నారు. హుస్నాబాద్ చైర్పర్సన్ పదవిని దండి లక్ష్మి, బూర్గుల లత, బత్తుల స్వరూప ఆశిస్తుండగా, వీరిలో దండి లక్ష్మికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వైస్ చైర్పర్సన్ పదవిని చిత్తారి పద్మ, ఆకుల రజిత, పిల్లి తిరుపతి, బొలిశెట్టి రాజు ఆశిస్తున్నారు. దుబ్బాక చైర్పర్సన్ పదవిని బండి శ్రీలత, శ్రీరాం సంగీత, వైస్ చైర్పర్సన్ పదవిని ఆస సులోచన, గోవింద శోభారాణి, మూర్తి సంధ్య ఆశిస్తున్నారు. గోవింద శోభారాణికి ఎమ్మెల్యే గతంలోనే వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తానని మాట ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
చేర్యాలలో చైర్పర్సన్ పదవి ముస్త్యాల అరుణ, కమలాపురం గీతాంజలి పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఎస్సీ వర్గంలోని రెండు విభాగాల వారు తమ వర్గానికే చైర్పర్సన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వైస్ చైర్పర్సన్ పదవి కోసం నిమ్మ సుప్రజ, ఎజాజ్ అహ్మద్ పోటీ పడుతున్నారు. గజ్వేల్ చైర్ పర్సన్ పదవికి కల్యాణ్కర్ పద్మాబాయి, గంగిశెట్టి చందన, బొగ్గు స్వప్న పేర్లు వినపడుతున్నాయి. వైస్ చైర్పర్సన్ పదవికి గోలి మమతతో పాటు బీఆర్ఎస్ రెబెల్ గా గెలిచిన అత్తిల్లి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.
అత్తిల్లి శ్రీనివాస్ కు ఇవ్వాలని నియోజకవర్గ నాయకుడు ప్రతాపరెడ్డి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా గెలిచిన అత్తిల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు క్యాంప్‌నకు వెల్లడం ఆసక్తి కలిగిస్తోంది.
ఆ ఏడు చోట్ల స్వతంత్రులే కీలకం..
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 4 చోట్ల, బీఆర్ఎస్ రెండు చోట్ల సంపూర్ణ మెజార్టీ సాధించగా, మరో 5 బల్దియాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కక హంగ్ ఏర్పడింది. జహీరాబాద్ లో మ్యాజిక్ ఫిగర్ 19 ఉండగా కాంగ్రెస్ 14 స్థానాలు కైవసం చేసుకుంది. చైర్పర్సన్ పదవి దక్కించుకునేందుకు ఇద్దరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఇప్పటికే కాంగ్రెస్ క్యాంప్‌లో చేరిపోయారు. ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
మరో కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ మహమ్మద్ జాఫర్ తనకు చైర్పర్సన్ లేదంటే వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తే మద్దతు ఇస్తానని చెబుతున్నారు. చైర్ పర్సన్ పోస్ట్ కోసం కాంగ్రెస్ లో 18వ వార్డు నుంచి ఎన్నికైన గునెల్లి కవిత పేరు వినిపిస్తోంది. కోహిర్ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 9 ఉండగా, కాంగ్రెస్ కు 8 మంది బలం ఉంది. ఎంఐఎం కౌన్సిలర్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో కోహిర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. చైర్పర్సన్ కోసం 4వ వార్డు కౌన్సిలర్ అశోక్, 12వ వార్డు కౌన్సిలర్ శిరీష పోటీ పడుతుండగా, అశోక్ కు చైర్పర్సన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇస్నాపూర్ లో ఇద్దరు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్కు మ్యాజిక్ ఫిగర్ సరిపోవడంతో చైర్పర్సన్ స్థానానికి అడ్డు తొలగింది. గడ్డపోతారం చైర్ పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, ఇక్కడ బీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. 5వ వార్డు కౌన్సిలర్ గద్దె సుష్మ, 14వ వార్డు కౌన్సిలర్ నీరుడి ప్రభావతి చైర్ పర్సన్ కోసం పోటీ పడుతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట బల్దియాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, చైర్ పర్సన్లుగా కూన వనిత, అంజమ్మ, వైస్ చైర్మన్లుగా షేక్ షఫీయుద్దీన్, రేణుక పేర్లను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.
