మెదక్ టౌన్, వెలుగు: తల్లిని హత్య చేసిన కొడుకుకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా జడ్జి నీలిమ బుధవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామానికి చెందిన మోహన్ గారి సుదర్శన్ మద్యానికి బానిసై తరచూ తన భార్యను వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
అనంతరం సుదర్శన్ తన తల్లి సత్తమ్మ వద్దకు వెళ్లి డబ్బులు కావాలని మద్యం మత్తులో తరచూ గొడవపడుతూ తిట్టడం, కొట్టడం చేసేవాడు. తన భార్యను తీసుకురావాలని తల్లితో గొడవ పడేవాడు.
2025 నవంబరు 8న అర్ధరాత్రి సుదర్శన్ మద్యం మత్తులో తల్లితో గొడవ పడి కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలతో సత్తమ్మ అక్కడికక్కడే చనిపోయింది.
టేక్మాల్ ఏఎస్సై కృష్ణ కేసు నమోదు చేయగా, అల్లాదుర్గం సీఐ రేణుక కేసు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.
