మేమేం తక్కువా.. మాకు మరిన్ని టెస్ట్ మ్యాచులు కావాలి: హర్మన్ ప్రీత్ కౌర్ డిమాండ్..!

మేమేం తక్కువా.. మాకు మరిన్ని టెస్ట్ మ్యాచులు కావాలి: హర్మన్ ప్రీత్ కౌర్ డిమాండ్..!

బ్రిటన్: ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత మహిళ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. పురుషుల మాదిరిగానే మాకు మరిన్ని టెస్ట్ మ్యాచులు నిర్వహించాలని కోరారు. మ్యాచ్‌కు ముందు గురువారం (జులై 9) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ఒక ప్లేయర్‎గా తాము ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

గత కొన్ని సంవత్సరాలుగా మహిళల క్రికెట్‎కు ఆదరణ పెరుగుతోందన్నారు. భవిష్యత్‎లో రెడ్ బాల్ ఫార్మాట్‎లో కూడా మహిళలకు ఎక్కువ మ్యాచులు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 నుంచి ఇప్పటివరకు భారత మహిళల జట్టు కేవలం 7 టెస్టులు మాత్రమే ఆడగా.. ఇదే సమయంలో పురుషుల జట్టు 58 టెస్టులు ఆడిందని గుర్తు చేశారు. 

పురుషుల మాదిరిగానే మహిళా క్రికెటర్లకు కూడా మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఆమె కోరారు. అయితే, మహిళా జట్టుకు మ్యాచ్‌ల సంఖ్యను పెంచడం అనేది పూర్తిగా ఉన్నతాధికారుల చేతుల్లో ఉంటుందని.. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ సరైన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. మహిళలు టెస్ట్ మ్యాచ్‌లలో రాణించాలంటే దేశవాళీ క్రికెట్‎లో రెడ్‌బాల్ టోర్నీలను మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.