హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ్మిశెట్టి ప్రవీణ్ (34) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు మూడు నెలల క్రితమే వివాహమైంది. అయితే, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఈ నష్టాల కారణంగా కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద పరువు పోతుందనే ఆందోళనకు గురైన ప్రవీణ్.. చైతన్యపురిలోని ఓ భవనంపై నుంచి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ మృతికి దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
