హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు ఎదురుగా ఉన్న మదీనా క్రాస్‌రోడ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాంబే హోజరీలో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దుకాణంతో పాటు బట్టల గోదాములోనూ అగ్నిప్రమాదం సంభవించింది
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చార్మినార్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.
బట్టల షాపు , గోదాములో మంటలు చెలరేగడంతో బట్టల నిల్వలకు నష్టం వాటిల్లి ఉండవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
బాంబే హోజరీలో అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే విషయం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? మరేదైనా కారణమా? అనే అంశాలపై అధికారుల విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
