పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు.. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి 

పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు.. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి 

కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లడంతో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కూసుమంచి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. దూరం నుంచి ఈ విషయాన్ని గమనించిన జాలరులు, పోలీసులకు సమాచారం అందజేశారు. 

క్రేన్ సహాయంతో నీట మునిగిన కారును పోలీసులు వెలికి తీశారు. కారులో వెనుక సీటులో ఏపీలోని కర్నూల్​ జిల్లా నందికొట్కూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్(50) మృతదేహం ఉండగా, డ్రైవర్ ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ పదేళ్లుగా హైదరాబాదులో ఉంటున్నారు. 

‘పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశ సమయంలో పవన్ కల్యాణ్ హటావో, పాలిటిక్స్ బచావో పేరుతో ఈయన రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రమాదం ఉందంటూ ఆయన పోలీసులను కూడా ఆశ్రయించారు. 

ఉద్దేశపూర్వకంగానే కారును పాలేరు జలాశయంలోకి నడిపి, డ్రైవర్ పరార్​ అయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్​ డెడ్​బాడీని నేలకొండపల్లి దవాఖానకు తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు.