ఈ వారం సండే స్పెషల్ ..ఉపవాసం ఉండేవాళ్లకు ఫుల్ ఎనర్జీ బ్రేక్ ఫాస్ట్

ఈ వారం సండే స్పెషల్ ..ఉపవాసం ఉండేవాళ్లకు ఫుల్ ఎనర్జీ బ్రేక్ ఫాస్ట్

ఇటు శివరాత్రి, అటు రంజాన్​ మాసం మొదలు.. ఈ ఉపవాసాల తరుణంలో రోజంతా శక్తినిచ్చే ఫుడ్​ తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే ఈ వారం స్పెషల్స్ ఉపవాసం ఉండేవాళ్లకు ఫుల్​ ఎనర్జీ ఇచ్చే ఐటెమ్స్. ఒక్కసారి వీటి తయారీ తెలుసుకున్నారంటే మామూలు రోజుల్లో కూడా సరదాగా చేసుకుని తినేయొచ్చు. మరింకేం.. షురూ చేయండి. ​ 

పనీర్ రోల్స్

కావాల్సినవి :
ఆలుగడ్డలు (ఉడికించినవి)– రెండు 
పనీర్ – రెండు కప్పులు
పచ్చిమిర్చి – ఒకటి
అల్లం తరుగు – అర టీస్పూన్
మిరియాల పొడి, యాలకుల పొడి, జీలకర్ర
పొడి – ఒక టీస్పూన్
ఉప్పు – సరిపడా
ఎండుద్రాక్ష – ఎనిమిది
జాజికాయ పొడి – చిటికెడు
కొత్తిమీర – కొంచెం
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
ఒక గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డలు వేసి మెదపాలి. అందులో తురిమిన పనీర్, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు, జీలకర్రపొడి, మిరియాల పొడి, కొత్తిమీర, ఎండుద్రాక్ష, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వేలెడంత సైజులో రోల్స్​లా తయారుచేయాలి. పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో రెడీ చేసిపెట్టుకున్న పనీర్ రోల్స్ వేసి దోరగా వేగించాలి. 


సగ్గుబియ్యం పరాటా

కావాల్సినవి :
సగ్గుబియ్యం - ఒక కప్పు
ఆలుగడ్డలు - రెండు
మిరియాల పొడి - ఒక టీస్పూన్
ఉప్పు, నూనె, నెయ్యి, నీళ్లు - సరిపడా
జీలకర్ర - అర టీస్పూన్
పల్లీల పొడి - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు 
కొత్తిమీర - కొంచెం
అల్లం - చిన్న ముక్క

తయారీ :
పాన్​లో సగ్గుబియ్యం వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత వాటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసి పొడిలా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో సగ్గుబియ్యం పొడి వేసి అందులో ఉడికించి, మెదిపిన ఆలుగడ్డ, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర, పల్లీల పొడి, అల్లం తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. కొన్ని నీళ్లు పోసి ముద్దగా చేయాలి. బటర్ పేపర్ మీద నూనె పూసి కొంచెం పిండి తీసుకుని చపాతీలా వత్తాలి. అలా రెడీ చేసుకున్న వాటిని నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. 


చనా చాట్

కావాల్సినవి :
నూనె - టేబుల్ స్పూన్
అల్లం - ఒక చిన్న ముక్క
శనగలు - అర కిలో
వెల్లుల్లి రెబ్బలు - మూడు
ఉల్లిగడ్డ - ఒకటి
టొమాటోలు - రెండు
పసుపు, నిమ్మరసం - ఒక్కోటి అర టీస్పూన్
జీలకర్ర, గరం మసాలా, కారం - ఒక టీస్పూన్
నీళ్లు, ఉప్పు - సరిపడా
పాలకూర - ఒక కప్పు
మెంతికూర - అర కప్పు

తయారీ : పాన్​లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. టొమాటో తరుగు, పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. కాసేపయ్యాక నీళ్లు పోసి శనగలు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. పాలకూర, గరం మసాలా, నిమ్మరసం, మెంతికూర వేసి కలపాలి.