- మేము గెలిచిన 17 సీట్లతో పాటు
- హంగ్ మున్సిపాలిటీల్లోనూ మాకు అవకాశం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తితో ఉందని, వాళ్లు ఆశించినన్ని స్థానాలు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమకు 30కిపైగా మున్సిపాలిటీలు వస్తాయనుకున్నామని, కానీ.. కొన్ని తగ్గాయని చెప్పారు. పార్టీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని కొనియాడారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడినోళ్లందరికీ ఈ ఎన్నికలే సమాధానమన్నారు.
తాము గెలిచిన 17 స్థానాలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లోనూ తమకు విజయావకాశాలు ఉన్నాయని చెప్పారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. బీజేపీకి గతంలో కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని, వార్డులు కూడా తక్కువే గెలిచిందని, అయినా కూడా వాళ్లు పార్టీ పెర్ఫార్మెన్స్ బాగుందని ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.
ప్రభుత్వంలో ఉన్నోళ్లకే అనుకూలం
స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, ప్రభుత్వ అధికారంలో ఉన్నోళ్లకే అనుకూల పరిస్థితులు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను గెలిచిందని ప్రశ్నించారు. నాలుగు మున్సిపాలిటీలతోనే సరిపెట్టుకున్నదని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపవన్నారు.
జైల్లో పెట్టినా భయపడను
ప్రభుత్వం మరోసారి ఫార్ములా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ చెప్పా రు. ఇప్పటికే నాలుగుసార్లు పిలిచినా వాళ్లు చేసిందేమీ లేదన్నారు. తమాషా కోసమే మరోసారి పిలుస్తారన్న సమాచారం ఉందని చెప్పారు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తానని, నిజాన్ని స్పష్టంగా చెప్తానని పేర్కొన్నారు. ఎన్నిసార్లు విచారించినా ఇబ్బంది లేదని, చివరికి అరెస్ట్ చేసి జైలులో పెట్టినా భయపడేది లేదన్నారు.
