రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన జరిగింది. తనను క్షేమంగా ఇంటి దగ్గర దింపుతామని నమ్మించిన సొంత కంపెనీ ఉన్నతాధికారులే ఒక మహిళా మేనేజర్‌పై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఐటీ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.
శనివారం రాత్రి ప్రైవేట్ ఐటీ కంపెనీ సీఈఓ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన పార్టీ ఆదివారం(డిసెంబర్ 20) తెల్లవారుజామున 1:30 వరకు కొనసాగింది. పార్టీ ముగిసిన తర్వాత బాధితురాలు ఒక్కరే మిగిలి ఉండటంతో.. అదే కంపెనీకి చెందిన సీఈఓ, ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త కలిసి మహిళా మేనేజరును ఇంటి దగ్గర దింపుతామని కారులో ఎక్కించుకున్నారు.
ప్రయాణ మధ్యలో కారును ఒక షాపు వద్ద ఆపిన నిందితులు, సిగరెట్లను పోలిన కొన్ని పదార్థాలను కొనుగోలు చేశారు. వాటిని బలవంతంగా బాధితురాలితో తీసుకునేలా చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో కారులోని సీఈఓ, ఎగ్జిక్యూటివ్ భర్త తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన బాధితురాలు తాను లైంగిక దాడికి గురైనట్లు గుర్తించి పోలీసులకు కంప్లెయింట్ చేసింది.
►ALSO READ | ఈ బ్యాంకు మేనేజర్ లేకుంటే రూ.18 లక్షలు గోవిందా .. నల్గొండ జిల్లాలో సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా కాపాడాడంటే..
ఈ దారుణానికి సంబంధించిన ఆడియో, వీడియో దృశ్యాలు ఆ కారులోని డ్యాష్‌క్యామ్ లో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారనుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఉదయపూర్ ఎస్పీ యోగేష్ గోయల్ తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అదనపు ఎస్పీకి అప్పగించారు. సో ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనతో పాటు పనిచేసే ఇతర ఉద్యోగులతో కూడా కొంత జాగ్రత్త అవసరమేనా అనే ఆందోళనలు చాలా మంది ఉద్యోగులను వెంటాడుతున్నాయి.
