10 రోజుల్లో జీహెచ్ఎంసీ అప్పుల పంపకాలు

10 రోజుల్లో జీహెచ్ఎంసీ అప్పుల పంపకాలు
  • ఏర్పాటైన టాస్క్​ఫోర్స్​ కమిటీ
  • కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం
  • పదేండ్లలో రూ. 6,530 కోట్ల అప్పులు
  • నెలకు రూ. 100 కోట్ల చొప్పున చెల్లింపులు
  • ఇంకా మిగిలింది రూ.4,876 కోట్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆస్తులు, అప్పుల పంపిణీ ప్రక్రియ మొదలైంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ రూ.6,530 కోట్ల అప్పులు చేయగా, వడ్డీతో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తుండడంతో ప్రస్తుతం రూ.4,876 కోట్ల అప్పులు మిగిలాయి. దీంతో ఏ కార్పొరేషన్​కు ఎంత అప్పు కేటాయించాలనే అంశంపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆస్తుల విలువను బట్టి అప్పులను సమానంగా విభజించేందుకు జరుగుతున్న ఈ అధ్యయన ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తికానుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

మార్కెట్లు, షాపులు కూడా..

కొత్తగా ఏర్పడిన జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీని వివాదాల్లేకుండా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు కార్పొరేషన్లలో సమానంగా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అప్పులతో పాటు జీహెచ్‌ఎంసీకి ఉన్న 24 మార్కెట్లు, వాటిలోని 2,363 షాపులను కూడా ఆయా కార్పొరేషన్ల పరిధిని బట్టి విభజించనున్నారు. ఏ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ఆస్తులను ఆ కార్పొరేషన్​కే అప్పగించడం ద్వారా పారదర్శకమైన పాలన అందించాలని అధికార పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

అప్పుల లెక్క ఇలా.. 

గడిచిన పదేండ్లలో జీహెచ్‌ఎంసీ వివిధ అభివృద్ధి పనుల కోసం ఎస్బీఐ, హడ్కో వంటి సంస్థల నుంచి మొత్తం రూ. 6,530 కోట్ల అప్పులు సేకరించింది. ఇందులో ప్రధానంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ. 4,250 కోట్లు, రోడ్ల నిర్వహణ కోసం రూ. 1,460 కోట్లు, ఎస్ఎన్డీపీ  కోసం రూ. 680 కోట్లు తీసుకున్నారు. అలాగే జేఎన్ఎన్ యూఆర్ఎం ఇండ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి వివిధ వడ్డీ రేట్లతో రూ. 140 కోట్ల రుణం పొందింది. ఈ అప్పులను తీర్చేందుకు నెలకు రూ. 100 కోట్లు చొప్పున ఇప్పటివరకు మొత్తం రూ. 1,654 కోట్లను జీహెచ్‌ఎంసీ తిరిగి చెల్లించింది.