ఈ బ్యాంకు మేనేజర్ లేకుంటే రూ.18 లక్షలు గోవిందా .. నల్గొండ జిల్లాలో సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా కాపాడాడంటే..

ఈ బ్యాంకు మేనేజర్ లేకుంటే రూ.18 లక్షలు గోవిందా .. నల్గొండ జిల్లాలో సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా కాపాడాడంటే..

మీకు తెలియకుండానే మీ పేరున సిమ్ కార్డు తీసుకుంటారు. డ్రగ్స్ మాఫియాతో కాల్స్ మాట్లాడతారు. మీరు గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారు. మీ కాల్ లిస్టు ఇదే.. ఈ సిమ్ మీ పేరుమీదనే ఉంది అని ఫోన్ చేస్తారు. పోలీసులమని చెప్పి.. డిజిటల్ అరెస్టు చేస్తామని మీ నుంచి సర్వం దోచేస్తారు. నల్గొండ జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణానికి చెందిన పుచ్చకాయల దేవేందర్ రెడ్డిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు.  దేవేందర్ రెడ్డి పేరుతో కొత్త సిమ్ తీసుకుని బెంగళూరులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేశారు.  డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేయడం దేవేందర్ రెడ్డిని తీవ్ర భయాందోళనలో పడవేసింది.

తామిచ్చిన అకౌంట్ నెంబర్‌కు వెంటనే రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు సైబర్ దుండగులు. దీంతో బెదిరింపులకు భయపడి రూ.18 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకుకు వెళ్లాడు బాధితుడు.  ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో ఒక్కసారిగా రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని దుండగులు కోరడంతో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. ఒకే సారి అంత మొత్తం డిపాజిట్ చేయడంపై అనుమానం వచ్చిన మేనేజర్‌.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

►ALSO READ | పోచంపల్లి కి రూ. 14 కోట్లు రిలీజ్ చేయండి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

మేనేజర్ సమాచారంతో తక్షణమే బ్యాంకుకు చేరుకున్న సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ విష్ణుకుమార్, సిబ్బంది..  దేవేందర్ రెడ్డికి వచ్చిన ఫోన్ కాల్ లిస్ట్‌ను పరిశీలించారు.  సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసి.. పలు ప్రశ్నలు సంధించారు. పోలీసుల ప్రశ్నలకు తడబడిన దుండగులు సమాధానాలు చెప్పలేక వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. 

దీంతో ఇది సైబర్ ఫ్రాడ్ అని నిర్ధారించిన పోలీసులు.. రిటైర్డ్ టీచర్ అయిన దేవేందర్ రెడ్డిని అప్రమత్తం చేశారు. రూ.18 లక్షలు ట్రాన్స్ఫర్ కాకుండా నిలువరించారు.  ఎవ్వరూ ఇలాంటి మోసపూరిత వ్యక్తులను నమ్మకుండా 1930 టోల్ ఫ్రీ నంబరు కు రిపోర్ట్ చేయాలని సూచించారు DSP  లక్ష్మీనారాయణ.  సకాలంలో స్పందించిన నల్లగొండ సైబర్ క్రైమ్ పోలీసుల పనితీరును, బ్యాంకు మేనేజర్ ను అభినందించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.