బడ్జెట్ దెబ్బతో లిక్కర్ రేట్లకు రెక్కలు.. రూ.వెయ్యి బాటిల్ రేటు ఇప్పుడు ఎంతంటే..?

బడ్జెట్ దెబ్బతో లిక్కర్ రేట్లకు రెక్కలు.. రూ.వెయ్యి బాటిల్ రేటు ఇప్పుడు ఎంతంటే..?

ప్రతి ఏటా బడ్జెట్ అనగానే సామాన్యుడు మొట్టమొదట వెతికేది.. ఏ వస్తువుల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయి అనే. కేంద్ర బడ్జెట్ 2026లో ఈసారి కూడా 'సిన్ గూడ్స్' అంటే మద్యం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలపై భారం పడింది. పాత ధరలతో పోలిస్తే ఇప్పుడు మద్యం బాటిల్ కొనాలన్నా, సిగరెట్ ప్యాకెట్ పట్టాలన్నా జేబుకు పెద్ద చిల్లే పడుతోంది. ముఖ్యంగా మద్యం ప్రియులకు ఈ బడ్జెట్ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

నిజానికి మద్యంపై పన్నులు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్ లో తీసుకునే కొన్ని సాంకేతిక నిర్ణయాలు వీటి ధరలపై ప్రభావం చూపుతాయి. ఈసారి బడ్జెట్‌లో ఆల్కహాల్ స్క్రాప్, మినరల్ సేల్స్ మీద ఉండే TCS -ను గతంలో ఉన్న 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు. ఇది చిన్న మార్పులా అనిపించినా.. సప్లై చైన్ ద్వారా తయారీదారుల నుండి వినియోగదారుడికి చేరేసరికి ధర భారీగానే పెరుగుతుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్సైజ్ సుంకాలను సవరించే అవకాశం ఉండటంతో ధరల పెరుగుదల అనివార్యంగా మారింది.

పన్ను మార్పుల వల్ల గతంలో రూ.వెయ్యి ఉన్న ఒక మద్యం బాటిల్ ధర ఇప్పుడు సుమారు రూ.1,050 నుండి రూ.1,100 వరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా ఉండే ఎక్సైజ్ నిబంధనలను బట్టి ఈ ధరలో మార్పులు ఉండవచ్చు. సిగరెట్ల విషయానికొస్తే వీటిపై దాదాపు 40 శాతం జీఎస్టీతో పాటు అదనపు సెస్, ఎక్సైజ్ డ్యూటీలను విధించారు. దీనివల్ల పొగ తాగే అలవాటు ఉన్నవారికి నెలవారీ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. అయితే బీడీల రేట్లు మాత్రం పెద్దగా మారలేదు. ఇది ఆ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రభుత్వాలు ఈ రకమైన పన్నుల పెంపు ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని చూస్తున్నాయి. వినియోగం తగ్గకపోతే ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురుస్తుంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం పన్నులు పెంచి ధరలు పెంచడం వల్ల ప్రజలు ఈ అలవాట్లకు దూరమవుతారని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా బడ్జెట్ 2026 తర్వాత సగటు మధ్యతరగతి కుటుంబంలో విలాసాల కోసం కేటాయించే బడ్జెట్‌ను ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.