వనజీవి రామయ్యపై పాన్‌ ఇండియా సినిమా

వనజీవి రామయ్యపై పాన్‌ ఇండియా సినిమా

పర్యావరణ పరిరక్షణ సందేశంతో, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జీవితం ఆధారంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘వనజీవి రామయ్య’. బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో నటించగా,  నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి నిర్మించారు.  గద్దర్ అవార్డుల్లో ఉత్తమ లఘుచిత్రాల విభాగంలో ఎంపికైన ఈ చిత్రాన్ని త్వరలో పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్​గా తీసుకురాబోతున్నట్టు మేకర్స్‌ తెలియజేశారు. 

రామయ్య 90వ జయంతి సందర్భంగా బుధవారం వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను ఈ వేడుకలో సత్కరించారు. రాష్ట్రంలోని పల్లె ప్రకృతి వనాలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని ఈ సందర్భంగా నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  

దర్శకుడు వేముగంటి, నటి నాగరాణి, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.